ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లా చంద్రబాబు పాలన | - | Sakshi
Sakshi News home page

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లా చంద్రబాబు పాలన

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు పాలన ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ తరహాలో నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ప్రచార ఆర్భాటంగానే మిగులుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన కాకినాడలో మంగళవారం జరిగిన పార్టీ సంస్థాగత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండేళ్ల కూటమి పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. దాదాపు అన్ని వర్గాల ప్రజలూ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. ఈ రెండేళ్లలో టీడీపీ మూడో స్థానానికి దిగజారిపోయిందన్నారు. అదే సమయంలో వైఎస్సార్‌ సీపీ బలమైన పక్షంగా ప్రజలకు అండగా ఉంటోందని చెప్పారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారని దుయ్యబట్టారు. పరిపాలన గాడిద తప్పిందని, ప్రభుత్వాసుపత్రుల్లో కనీసం మందులు కూడా లేవని ఆక్షేపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో మోసం జరిగిందంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై ఎన్నికల కమిషన్‌ స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పార్టీ మార్గదర్శకాల ప్రకారం సంస్థాగత నిర్మాణానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని రాజా పిలుపునిచ్చారు. పది రోజుల్లో గ్రామ, వార్డు స్థాయిల్లో పార్టీ సభ్యుల డిజిటలైజేషన్‌, పార్టీ కేంద్ర కార్యాలయానికి అప్‌లోడ్‌ చేయడం పూర్తి చేయాలని చెప్పారు. సభ్యత్వ నమోదులో అన్నీ పక్కాగా నిర్వహించిన పార్టీ కాకినాడ సిటీ నియోజకవర్గ శ్రేణులను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన నియోజవర్గాల్లో సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మోసపోయిన వర్గాలను చేరదీయాలని నాయకులకు సూచించారు.

సమన్వయంతో కదలాలి

వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, వార్డు స్థాయిలో పార్టీ సభ్యుల డిజిటలైజేషన్‌ను సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. ఈ విషయంలో పార్టీ వార్డు ఇన్చార్జిలు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ నెల 16, 17 తేదీల్లో పార్టీ అధ్యక్షుని సమక్షంలో జరిగే సమావేశం నాటికి సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పారు. జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు.

ఓటర్ల సవరణపై అప్రమత్తంగా ఉండాలి

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోసం పార్టీ తలపెట్టే ప్రతి ఆందోళనలోనూ కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో పార్టీ సీనియర్‌ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఓట్ల తొలగింపునకు చంద్రబాబు, లోకేష్‌ చేసే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం మాట్లాడుతూ, ఓటర్ల సవరణ ప్రక్రియ సందర్భంగా పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా ప్రతి నాయకుడూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్‌ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో ప్రచారం తప్ప అభివృద్ధి లేదని, అన్ని వర్గాల ప్రజలూ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తొలుత పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు సిగల మధు, మంగరాజు, పోలిశెట్టి నాగేశ్వరరావుల మృతికి సంతాప సూచకంగా పార్టీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌ కుమార్‌ (బన్నీ), మాజీ డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌ కుమార్‌, ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మాట్లాడుతున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా

చిత్రంలో జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, పార్టీ పరిశీలకుడు సూర్యనారాయణరాజు తదితరులు

ఫ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత

ఫ అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి

ఫ వైఎస్సార్‌ సీపీ జిల్లా

అధ్యక్షుడు దాడిశెట్టి రాజా

ఫ కాకినాడలో పార్టీ సంస్థాగత సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement