గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): పదో తరగతి తప్పిన విద్యార్థులు మనోధైర్యంతో చదివి, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గొల్లప్రోలు, చేబ్రోలుల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. అనంతరం చేబ్రోలులో ఇంటింటా జనగణన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. స్థానిక ఈబీసీ కాలనీలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఐదేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మిల్లు గరువు వద్ద ఉన్న పట్టు పరిశ్రమ శాఖ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. గిట్టుబాటు ధర, ఇతర సౌకర్యాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, గొల్లప్రోలు పీహెచ్‌సీని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్యం, ఆసుపత్రిలో ఇతర సదుపాయాలను పరిశీలించారు. సూయిజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ) ఏర్పాటుకు వివిధ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) పీడీ ఎన్‌వీ శివరామ్ ప్రసాద్, గొల్లప్రోలు తహసీల్దార్ జీఎం రాంప్రసాద్, గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు, పట్టు పరిశ్రమ శాఖ డీడీ బి.గీతారాణి, ఎంఈఓ బి.వెంట శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
12న జెడ్పీ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని సీఈఓ లక్ష్మణరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బడి బస్సులకు
నిబంధనలు పాటించాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు ఉన్న 1,686 బస్సుల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణా శాఖాధికారి కె.శ్రీధర్ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ హరినాథరెడ్డి, సిబ్బంది మంగళవారం తనిఖీ చేశారు. బస్సులో ఎమర్జెన్సీ అలారం, ఫైర్‌సేఫ్టీ, స్పీడ్ గవర్నర్, బ్రేకులు, వాహన సాంకేతికత వంటి అంశాలను పరిశీలించారు. మొత్తం 48 బస్సులను పరిశీలించగా, 19 బస్సులను రిజెక్ట్ చేసి, నోటీసులు జారీ చేశారు.
పాలిసెట్‌లో
90.83 శాతం ఉత్తీర్ణత
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 25 నిర్వహించిన పాలిసెట్‌లో జిల్లాలోని విద్యార్థులు 90.83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షకు బాలుర విభాగంలో 6,155 హాజరవగా 5,490 మంది (89.02 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 4,636 మందికి గాను 4,312 మంది (93.01 శాతం) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో పూడి చైతన్య 13, కొడవలి కార్తీక 23, కోట దేవీ వెంకట ప్రసన్న తన్వీశ్రీ 27 ర్యాంకులు సాధించారని పాలిసెట్ కో ఆర్డినేటర్ విజయకుమార్ తెలిపారు.
నరసన్న హుండీల
ఆదాయం రూ.18,92,187
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం ఎండోమెంట్స్ అధికారులు నిర్వహించిన వివిధ హుండీల లెక్కింపుల్లో భక్తుల నుంచి విరాళాలు రూపంలో మొత్తం రూ.18,92,187 ఆదాయం చేకూరింది. మార్చి 31 నుంచి మే 5వ తేదీ వరకూ 36 రోజులకు పై ఆదాయం వచ్చింది. ఎండోమెంట్స్ అమలాపురం తనిఖీదారుడు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఆలయంలోని హుండీలను తెరచి లెక్కింపు చేపట్టారు.


