పదోన్నతికి పైసలివ్వాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

పదోన్నతికి పైసలివ్వాల్సిందే..

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పదోన్నతులు రావడంతో గ్రేడ్‌–3 పంచాయతీ కార్యదర్శులు ఆనందంలో మునిగిపోయారు. సరిగ్గా ఇదే అదునుగా పదోన్నతుల పేరిట భారీ దోపిడీకి ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు పన్నాగం పన్నారు. రూ.20 వేలు ఇవ్వకుంటే పదోన్నతి రాదంటూ అర్హులైన కార్యదర్శులను భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 196 మంది గ్రేడ్‌–3 పంచాయతీ కార్యదర్శులున్నారు. వీరందరూ 2018, 2020 సంవత్సరాల్లో ఈ పోస్టుల్లో నియమితులయ్యారు. గ్రేడ్‌–2 కార్యదర్శులకు ప్రభుత్వం ఇటీవల గ్రేడ్‌–1గా పదోన్నతి కల్పించింది. దీంతో, గ్రేడ్‌–2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటికి భర్తీకి అర్హులైన వారి జాబితాను రూపొందించాలంటూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని 196 మంది గ్రేడ్‌–3 కార్యదర్శులూ అర్హులే కావడంతో ఆ మేరకు జాబితా తయారు చేశారు. సరిగ్గా ఇక్కడే తాళ్లరేవు, కాజులూరు మండలాల్లో పని చేస్తున్న ఇద్దరు గ్రేడ్‌–2 పంచాయతీ కార్యదర్శులు అవినీతి దందాకు తెర లేపారు. వ్యవహారమంతా తామే చూస్తున్నామని, ఎవరికై నా పదోన్నతి కావాలంటే కమిషనర్‌ కార్యాలయంలో ముడుపులు చెల్లించాలని, దీనికి గాను ప్రతి ఒక్కరూ రూ.20 వేలు ఇవ్వాల్సిందేనని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. అడిగినంతా ఇవ్వకుంటే పదోన్నతి రాదంటూ కొంత మంది గ్రేడ్‌–3 కార్యదర్శులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో, కొంతమంది ఇష్టం లేకపోయినా పదోన్నతి రాకపోతే ఇబ్బందులు పడతామనే భయంతో వారు అడిగినంత డబ్బులూ చెల్లించుకుంటున్నారు.

వారు మెక్కేందుకేనా?

పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గ్రేడ్‌–2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌–1గా పదోన్నతి కల్పించారు. ఎక్కడా ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోలేదు. కానీ, రగ్రేడ్‌–2 పదోన్నతులకు మాత్రం కమిషనర్‌ కార్యాలయంలో ఇవ్వాలంటూ గ్రేడ్‌–3 కార్యదర్శుల నుంచి జిల్లాలోని అక్రమార్కులు డబ్బులు గుంజుతూండటం హాట్‌ టాపిక్‌గా మారింది. కమిషనర్‌ కార్యాలయం పేరిట పెద్ద మొత్తంలో సొమ్ము నొక్కేసేందుకే వారిద్దరూ స్కెచ్‌ వేశారని పలువురు పంచాయతీ కార్యదర్శులు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి, పదోన్నతుల పేరిట ఆ ఇద్దరు కార్యదర్శులు అక్రమంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేలా చూడాలని బాధిత కార్యదర్శులు కోరుతున్నారు.

ఫ కమిషనర్‌ కార్యాలయంలో

ఇవ్వాలంటూ వసూళ్లు

ఫ ఇద్దరు పంచాయతీ

కార్యదర్శుల అవినీతి దందా

ఫ ఒక్కొక్కరి నుంచి

రూ.20 వేల గుంజుడు!

ఫ బాధిత కార్యదర్శుల గగ్గోలు

Advertisement
 
Advertisement
Advertisement