ఆర్‌డీఓ శ్రీరమణి సస్పెన్షన్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌డీఓ శ్రీరమణి సస్పెన్షన్‌ రద్దు

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

సామర్లకోట: పెద్దాపురం ఆర్‌డీఓ కె.శ్రీరమణి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో ఫిబ్రవరి 28న 28 మంది మరణానికి కారణమైన బాణసంచా విస్ఫోటంలో పోలీసు, రెవెన్యూ అగ్నిమాపక, కార్మిక శాఖల డివిజన్‌ స్థాయి అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా నాడు పెద్దాపురం ఆర్‌డీఓగా ఉన్న శ్రీరమణి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. సామర్లకోట మండలం ఏర్పడినప్పటి నుంచీ కాకినాడ డివిజన్‌లోనే ఉంది. ఆర్‌డీఓ సస్పెండ్‌ అవడానికి నెల రోజుల ముందే ఈ మండలాన్ని పెద్దాపురం డివిజన్‌లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనతో ఆర్‌డీఓకు అంతగా సంబంధం లేదంటూ ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. దీనికి తోడు రెవెన్యూ సంఘ నాయకులు కూడా ఈ విషయంపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపి, శ్రీరమణి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆమె పోస్టింగ్‌పై జీఓలో స్పష్టత ఇవ్వలేదు. పెద్దాపురం ఆర్‌డీఓగానే పోస్టింగ్‌ ఇస్తారా లేక మరోచోట నియమిస్తారా అనే విషయంపై చర్చ జరుగుతోంది. రెవెన్యూ సంఘాలు మాత్రం ఆమెకు పెద్దాపురంలోనే పోస్టింగ్‌ ఇవ్వాలని కోరుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement