కాకినాడ జీజీహెచ్ జీవోటి ఆపరేషన్ థియేటర్ వద్ద ఊడి వేలాడుతున్న సీలింగ్
కాకినాడ జీజీహెచ్ ఓపీ బిల్డింగ్ దుస్థితి
జీజీహెచ్ సర్జికల్ భవంతి వద్ద పెచ్చులూడిన స్లాబులు
● సమస్యలకు నిలయంగా ప్రభుత్వాసుపత్రులు
● రేటు నిర్ణయించి మరీ వసూళ్లు
● ‘పవన్’ఇలాకాలో నత్తను తలపిస్తోన్న
100 పడకల ఆస్పత్రి నిర్మాణం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/నెట్‌వర్క్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలతో వైద్యం అందక రోగులు అల్లాడిపోతున్నారు. సేవలకు రేటు నిర్ణయించి మరీ వసూళ్లు చేస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రితో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రులలో పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టులో వైద్యం అందించలేని అనేక విభాగాలు రోగులను నరకాన్ని చూపిస్తున్న పరిస్థితులు కళ్లకు కట్టాయి.
కాకినాడ
ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) అరకొర వైద్య సేవలు, నాణ్యత లేని సదుపాయాలు, బారులు తీరిన క్యూ లు, చాలని మందులతో రోగులకు నరకం చూపుతోంది. ఓపీ నిత్యం 2,000 పైమాటే. కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు వైద్యులే లేరు. అత్యవసర మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇన్‌పేషెంట్లకు సదుపాయాలు లేవు. ప్రసూతి, ఆర్థోపెడిక్ వార్డుల్లో ఇన్‌పేషెంట్లు ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు చికిత్స పొందుతున్నారు. గడచిన ఆరు నెలల కాలంలో పలువురు గర్భిణిలు మృత్యువాత పడటం వివాదాస్పదమైంది. ఒక వైద్యురాలు అయితే పాంటోప్రజోల్ ఇంజెక్షన్ గర్భిణికి సరిపడదని తెలిసినా చేసి ఆమె మరణానికి కారణమైంది. సర్జికల్, మెడికల్, గైనకాలజీ విభాగాల్లో సిబ్బంది డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారనే విమర్శలున్నాయి.
తుని
ఏరియా ఆసుపత్రిలో రోజుకు 500 ఓపీ ఉంటుంది. ఎక్కువ ధర కలిగిన ఇంజెక్షన్లు, మాత్రలు బయట కొనుగోలు చేసుకోవాలంటూ చీటీ రాసి పంపించేస్తున్నారు. శస్త్రచికిత్సలకు రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అన్ని విభాగాలకు కలిపి 43 మంది వైద్యులు ఉండాలి. 26 మందే ఉన్నారు. ట్రామాకేర్ సెంటర్‌లో 43 మంది సిబ్బందికి ఎనిమిది మందే ఉన్నారు.
పిఠాపురం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం నత్తను తలపిస్తోంది. రోజూ ఈ సీహెచ్‌సీలో 250 ఓపీ ఉండేది. ప్రస్తుతం 100 లోపు ఉంటోంది. ప్రసూతి, సాధారణ వైద్య సేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. రోగులు అర్బన్ హెల్త్‌సెంటర్లకు, కాకినాడ ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయిస్తున్నారు.
ప్రత్తిపాడు
ఏలేశ్వరం నగర పంచాయతీలోని అర్బన్ ఆస్పత్రి శిథిల భవనంలో నడుస్తోంది. వర్షం, ఎండలకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో రూ.96.48 లక్షలతో నూతన భవనం నిర్మించగా ఇటీవల ప్రారంభించారు. ప్రారంభించి నెల రోజులు దాటుతున్నా సేవలు అందడం లేదు. ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, చిన్నపిల్లల వైద్యులు లేరు.
కాకినాడ రూరల్ మండలం
పండూరు పీహెచ్‌సీలో ఓపీ 100 నుంచి 150 వరకు ఉంటుంది. ఆస్పత్రిలో ఆరు బెడ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ ఫీవర్లతో బాధపడుతున్న రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఆస్పత్రిలో ఇన్ పేషెంట్‌గా తిమ్మాపురం గ్రామానికి మహిళ జ్వరంతో చికిత్స పొందుతోంది. ఇద్దరు వైద్యులలో ఒకరు మెటర్నిటీ లీవ్‌లో ఉంటే ఆ పోస్టులో డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి వచ్చిన వైద్యురాలు సేవలు అందిస్తున్నారు. 13 మంది సిబ్బంది ఉండాల్సిన ఈ పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు మాత్రమే ఉన్నారు. ప్రసూతి వైద్యం, మత్తు వైద్యులు లేక రోగులు కాకినాడ జీజీహెచ్‌కు వెళుతున్నారు.
శిథిలావస్థలో ఉన్న తుని ఆస్పత్రి భవనం
జగ్గంపేట
గండేపల్లి మండలం జెడ్ రాగంపేటలో ఉన్న 30 పడకల సీహెచ్‌సీకి రోజుకి సుమారు 200 మంది రోగులు వస్తుంటారు. డెలివరీ కేసులకు రూ.1,000 వంతున వసూలు చేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే రోగి బంధువులతో సిబ్బంది వాగ్వావాదానికి దిగుతున్నారు. డెలివరీ అయిన తల్లి, బిడ్డకు మందులు బయట కొనుక్కోవాల్సి వస్తుంది. నర్సింగ్ పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి.
పెద్దాపురం
నియోజకవర్గ కేంద్రంలో ఉన్న సామాన్య ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తానని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. గద్దె నెక్కి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు 100 పడకల ఆస్పత్రి ఊసేలేదు. పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలకు ఈ ఆస్పత్రి కీలకం.


