● ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం సున్నా
● ప్రజాసమస్యల పరిష్కార వేదికపై
ప్రజల పెదవి విరుపు
● చిన్న సమస్యలు కూడా
పరిష్కారం కాని వైనం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సమస్య చిన్నదైనా దానికి పరిష్కారం మాత్రం రావడం లేదు. అదే సమస్యపై పదేపదే అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) పై జనం పెదవి విరుస్తున్నారు. మండల కేంద్రాల్లో తమ గోడు పట్టించుకొనకపోవడంతో జిల్లా కేంద్రంలోని పీజీఆర్‌ఎస్‌కు వచ్చినా ఇక్కడ అదే తంతు కొనసాగుతుందోనని ప్రజలు మండిపడుతున్నారు. మంచినీటి కుళాయి ఇవ్వడం లేదని, అర్హత ఉన్నా పింఛన్ మంజూరు చేయడం లేదని, రైతు భరోసా నిధులు జమ కావడం లేదని, రీ సర్వేలో తమ భూమి తక్కువగా నమోదయ్యిందని ప్రజలు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 435 అర్జీలు సమర్పించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వచ్చి కలెక్టరేట్‌లో అర్జీలు అందజేశారు.
సర్వం బూడిదైనా పట్టించుకోవడం లేదు
గత నెల 25న గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఇల్లు, ఫ్రిజ్, టీవీ, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రోడ్డున పడ్డాను. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కట్టుబట్టలతో కుటుంబం వీధిన పడింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షలు నష్టం సంభవించింది. అధికారులు నాకు న్యాయం చేయాలి.
– ప్రగడ సత్యకామేష్, కత్తిపూడి, శంఖవరం మండలం
రైతు భరోసా నిధులు
జమకావడం లేదు
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రైతు భరోసా నిధులు నా ఖాతాలో పడడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నాకు రైతు భరోసా నిధులు వచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక చాలాసార్లు ఫిర్యాదు చేశాను. ఎవరూ పట్టించుకోవడం లేదు.
– అనుసూరి శ్రీను, రైతు, మాధవపట్నం, సామర్లకోట మండలం
పింఛన్ నిలిపివేశారు
గతంలో నాకు పింఛన్ వచ్చేది. గత ఏడాది నుంచి నాకు పింఛన్ నిలిపివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాను. నా భర్త కూడా చనిపోయాడు. నాకు ఈ పింఛన్ ఒక్కటే ఆధారం. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక సచివాలయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. అధికారులు స్పందించి నా పింఛన్ ఇప్పించాలి
– దేసాలంక చక్రమ్మ, ఎస్.అచ్యుతాపురం, కాకినాడ.
నా భూమి ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు
రీ– సర్వే కారణంగా నా భూమి ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. నాకు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో 75 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుతం 65 సెంట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యింది. మిగిలిన భూమి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సచివాలయంలో వీఆర్వో చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాను. అయినా పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో గత నెలలో ఫిర్యాదు చేశాను. అయినా పరిష్కారం కాలేదు.
– కడజారి శివలింగేశ్వరరావు, రైతు, తిమ్మాపురం


