లో
అకాల దుఃఖం
● దంచి కొట్టిన భారీ వర్షం
● లోతట్టు ప్రాంతాలు జలమయం
● నీట మునిగిన ధాన్యపు రాశులు
● కన్నీరుమున్నీరవుతున్న అన్నదాత
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఈదురు గాలులతో భారీ వర్షం దంచి కొట్టింది. జోరుగా కురిసిన వానతో కాకినాడ నగరంతో పాటు సామర్లకోట, జగ్గంపేట తదితర మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు విరిగిపడి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నాళ్లుగా మండుతున్న ఎండలతో ఆపసోపాలు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించినా.. అన్నదాతకు మాత్రం ‘అకాల’ దుఃఖమే మిగిల్చింది. చేతికి అంది వచ్చిన పంట కళ్ల ముందే తడిసి ముద్దవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
పులి మీద పుట్రలా..
జిల్లావ్యాప్తంగా సుమారు 1.90 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగింది. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 1.15 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంట కోతలు, మాసూళ్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ ప్రభుత్వం 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంకా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధాన్యం ధరలోనో లేదా బస్తాకు నాలుగైదు కేజీల వరకూనో కోత పెడుతున్నారంటూ పక్షం రోజులుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో తేమ శాతం తగ్గించుకునేందుకు పిఠాపురం, గొల్లప్రోలు, జగ్గంపేట, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ రూరల్, కరప తదితర మండలాల్లోని రైతులు రోడ్ల పైన, కళ్లాల్లోనూ ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పులి మీద పుట్రలా హఠాత్తుగా కురిసిన వర్షానికి ఆరబెట్టుకుంటున్న ధాన్యం తడిసిముద్దయ్యింది. అక్కడక్కడ అందుబాటులో ఉన్న బరకాలు కప్పినా, ధాన్యాన్ని రైతులు పెద్దగా కాపాడుకోలేకపోయారు. ప్రభుత్వం సమయానుకూలంగా ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ వర్షం వలన తమకు ఈ నష్టం జరిగి ఉండేది కాదని బాధిత రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
● జగ్గంపేట, గోకవరం మండలాల్లో ఎడతెరిపి లేకుండా గంటపాటు వర్షం కురిసింది. గోకవరం మండల రైతులు 8,325 ఎకరాల్లో రబీ వరి సాగు చేశారు. సుమారు 80 శాతం కోతలు పూర్తయ్యాయి. ధాన్యం కళ్లాల్లో ఉండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. బరకాలు కప్పి కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పలుచోట్ల ధాన్యపు రాశులు తడిసిపోయాయి. సుమారు 1,200 మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
● జగ్గంపేట మండలంలో 4,443 ఎకరాల్లో రబీ వరి సాగు జరిగింది. ఆరేడు వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో 3,400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకున్నారు. ఈ తరుణంలో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక్క కాట్రావులపల్లిలోనే సుమారు 5 వేల టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది. తేమ శాతం సాకుగా చూపుతూ 75 కేజీల బస్తాకు గతంలో ఎన్నడూ లేని విధంగా 5 కేజీల తరుగు తీసేస్తున్నారని రైతులు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. చివరకు నాణ్యమైన సంచులు కూడా సరఫరా చేయలేదని కాట్రావులపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు 40 వేల ఎకరాల్లో రబీ వరి సాగు జరగగా.. దాదాపు 10 వేల ఎకరాల్లో వరి పంట ఈ వర్షానికి తడిసిపోయింది. మరో 5 వేల ఎకరాల్లో పంట ఈదురు గాలులకు నేలకొరిగిపోయింది. సామర్లకోట – పెద్దాపురం రోడ్డులోని ఒక ప్రైవేట్ లే అవుట్‌లోను, రోడ్ల పైన ఆరబెట్టిన ధాన్యం.. ఒక్కసారిగా కురిసిన వర్షంతో డ్రైన్లలోకి కొట్టుకుపోయింది. గడచిన ఐదు రోజులుగా కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయనందువల్లనే ఇప్పుడు తాము నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
● ఈ వర్షానికి శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లోని పలు గ్రామాల్లో మామిడి, అరటి తోటలు దెబ్బ తిన్నాయి. మామిడి కాయలు రాలిపోవడంతో రైతుల ఆశలు నేలనంటేశాయి. శంఖవరం మండలం అచ్చంపేట, కొత్తపల్లి గ్రామాల్లో వరి పంట తడిసి ముద్దయిపోయింది.
● కాకినాడ రూరల్, కరప మండలాల రైతులు సుమారు 19,280 ఎకరాల్లో రబీ వరి సాగు చేశారు. ఇప్పటి వరకూ సుమారు 10 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయన్నది వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో సగం వరకూ ధాన్యాన్ని కళ్లాల్లోను, రోడ్ల వెంబడి రాశులుగా పోసి ఆరబెడుతున్నారు. ఈ సమయంలో వర్షం కురవడంతో బరకాలు కప్పి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లూ పడుతున్నారు.
8
పిడుగుపాటుకు మృత్యువాత
వర్షానికి పిడుగులు కూడా తోడవడంతో పెద్దాపురం మండలం జి.రాగంపేటలో ఓ కౌలు రైతు మృత్యువాత పడ్డాడు. పొలంలో వర్షానికి తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు కౌలు రైతు పెన్నాడ అర్జునరావు (60) ఆ రాశులపై బరకం కప్పుతున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అతడు మృతి చెందాడు. ఈ సంఘటనతో అతడి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంత రైతులు విషాదంలో మునిగిపోయారు.


