పచ్చిగా మోసం! | - | Sakshi
Sakshi News home page

పచ్చిగా మోసం!

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

పిఠాపురం: రబీ ధాన్యం కొనుగోళ్లలో కొంత మంది మిల్లర్లు, అధికార యంత్రాంగం కలిపి దోపిడీకి తెర తీసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో రబీ కోతలు ప్రారంభమైన తొలి రోజుల్లోనే పచ్చి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసిన కొంత మంది మిల్లర్లు.. ఇప్పుడు కొందరు అధికారులతో కుమ్మక్కై, ఎండు ధాన్యం కొంటున్నట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ) ద్వారా కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ (సీఎంఆర్‌) నమోదు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు రబీ వరి కోతలు పూర్తయిన పంట పొలాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు నమోదు చేయాల్సి ఉండగా.. సీఎంఆర్‌ నమోదు కోసం ఆ ప్రక్రియ ఎక్కడా జరగడం లేదని పలువురు అంటున్నారు. అయితే, అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని అధికారులు కొట్టిపారేస్తున్నారు. రబీలో జిల్లావ్యాప్తంగా సుమారు 1.90 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. దాదాపు 6.76 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది వ్యవసాయ శాఖ అంచనా. జిల్లాలో సుమారు 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణాకు 2,101 వాహనాలను, సుమారు 37.50 లక్షల గోనె సంచులు, 227 తేమ యంత్రాలను సిద్ధం చేశారు. అలాగే, 3,400 మంది హమాలీలను, 990 మంది సిబ్బందిని నియమించారు. సీఎంఆర్‌కు 119 రైస్‌ మిల్లులను ఎంపిక చేశారు.

ఏం జరుగుతోందంటే..

జిల్లాలో రబీ వరి కోతలు మార్చి నెలాఖరుకే ప్రారంభమయ్యాయి. అప్పటికి ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఇదే అదనుగా కొంత మంది ప్రైవేటు వ్యాపారులు పెద్ద మొత్తంలో పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసి, తమ మిల్లులకు తరలించేశారు. నిబంధనల ప్రకారం సాధారణ రకం 75 కిలోల బస్తాకు రూ.1,725, ఎ–గ్రేడ్‌ రకానికి రూ.1,777 చొప్పున మద్దతు ధర చెల్లించాలి. కానీ, అప్పటికప్పుడు మెషీన్‌తో కోసిన 75 కేజీల పచ్చి ధాన్యాన్ని రూ.1,250 నుంచి రూ.1,300కు కొనుగోలు చేశారని పలువురు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడక్కడ కొద్ది శాతం మాత్రమే ధాన్యం ఉందని అంటున్నారు. వరి కోతలు చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో లక్షల బస్తాల ఎండు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సీఎంఆర్‌లో నమోదు చేయిస్తూ, దోపిడీకి తెర లేపారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తమ వద్ద తక్కువ ధరకు కొన్న పచ్చి ధాన్యాన్ని ఇప్పుడు కొనుగోలు చేసినట్టుగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ.. ఒక్కో బస్తాకు రూ.400కు పైగా దోచుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈవిధంగా రూ.కోట్లలో దోపిడీ సాగుతోందన్నది వారి వాదన. పంట వేసినప్పుడు కామన్‌ వైరెటీగా ఉన్న సాధన రకం ధాన్యాన్ని కోతల సమయంలో గ్రేడ్‌–1 ఫైన్‌ వైరెటీగా మార్చారు. ఎక్కువ ధర చెల్లించాల్సి రావడంతో మిల్లర్లు ఈ రకం కొనుగోలును ప్రస్తుతం నిలిపివేశారు. తాము పండించిన సాధన రకం ధాన్యం తమ వద్దనే ఉండగా.. సీఎంఆర్‌లో కొనుగోలు చేసినట్లు చూపుతూ మోసానికి పాల్పడుతున్నారని రైతులు అంటున్నారు.

ధాన్యం కొనుగోళ్లు (ఫైల్‌)

అవాస్తవం

సీఎంఆర్‌ నమోదు నిబంధనల ప్రకారమే జరుగుతోంది. గతంలో కొన్న ధాన్యానికి ఇప్పుడు సీఎంఆర్‌ నమోదు అనేది అవాస్తవం కాదు. అటువంటిది ఎక్కడా లేదు. అలా జరిగి ఉంటే విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

– దేవులా నాయక్‌, జిల్లా మేనేజర్‌,

పౌర సరఫరాల సంస్థ, కాకినాడ

రబీ ధాన్యం దిగుబడి అంచనా

6.76 లక్షల టన్నులు

జిల్లాలో నెల రోజుల క్రితమే

పెద్ద మొత్తంలో పచ్చి ధాన్యం కొనుగోలు

75 కేజీల బస్తాకు రూ.1,300

మాత్రమే చెల్లించిన మిల్లర్లు

ప్రస్తుతం ఎండు ధాన్యం రూ.1,777కి

కొన్నట్లు సీఎంఆర్‌లో నమోదు!

రూ.కోట్ల మేర రైతు సొమ్ము దోపిడీ

సీఎంఆర్‌లో మాయాజాలం!

సీఎంఆర్‌ కోసం ఏ కేంద్రం నుంచి ఎంత మొత్తంలో ధాన్యం కొనుగోలు చేశారు, ఏ వాహనంపై, ఏ మిల్లుకు తరలిస్తున్నారు, ఎంత దూరం వెళ్తున్నాయి తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. కానీ, ప్రస్తుతం ఎక్కడా కొనుగోలు చేయకుండానే ఎండు ధాన్యం కొన్నట్టు చూపుతూ, మిల్లర్లకు అనుకూలంగా సీఎంఆర్‌ నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మెట్ట ప్రాంతంలోని ఓ బడా రైస్‌ వ్యాపారి నెల రోజుల క్రితమే భారీగా ఽపచ్చి ధాన్యం కొనుగోలు చేయగా.. ఆయనకు లాభం చేకూరేలా ఎండు ధాన్యం కొన్నట్లు అధికారులు సీఎంఆర్‌ నమోదు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీఎంఆర్‌ నమోదు ప్రక్రియపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement