● సత్యదేవుని భక్తులకు వాన కష్టాలు
● నమూనా ఆలయం వద్ద ఇబ్బందులు
అన్నవరం: జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు ఉన్న సత్యదేవుని నమూనా ఆలయం వద్ద స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు వాన కష్టాలు తప్పడం లేదు. కొద్దిపాటి వర్షం కురిసినా ఆలయం ముందు నీరు నిలిచిపోతోంది. దీంతో, ‘నీ దరి చేరేదెలా స్వామీ!’ అంటూ భక్తులు ఇబ్బందులు పడుతు న్నారు. గత్యంతరం లేక ఆ వాన నీటిలోనే నడిచి వెళ్తున్నారు. ప్రతి రోజూ విశాఖపట్నం వైపు వందలాది వాహనాల్లో వెళ్లే భక్తులు ఇక్కడ స్వామి, అమ్మవారిని దర్శించి, ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. ఈ ఆలయం వద్ద ప్రసాద విక్రయాలు, హుండీ ద్వారా ఏటా రూ.3 కోట్ల ఆదాయం వస్తోంది. అయినప్పటికీ కనీస వసతులు కల్పించడం లేదనే విమర్శలున్నాయి. రెండు నెలల క్రితం ఇక్కడ ప్రసాదాల ప్యాకెట్లపై ఎలుకల స్వైర విహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అప్పట్లో పెద్డాపురం ఆర్‌డీఓ పరిశీలించి, ఎలుకలు రాకుండా, భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు నమూనా ఆలయం వద్ద దేవస్థానం అధికారులు మెట్లు కట్టించి వదిలేశారు. ఆ మెట్ల ముందు ఫ్లోరింగ్, డ్రైన్ నిర్మించకపోవడంతో కొద్దిపాటి వర్షం కురిసినా ఆలయం వద్ద నీరు నిలిచిపోతోంది. అన్నవరంలో మూడు రోజులుగా రోజూ వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయమైతే భారీ వర్షమే కురవడంతో నీరు నిలిచిపోయి భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సత్యదేవుని ప్రసాద విక్రయశాల వద్ద కూడా వాన నీరు నిలిచిపోతోంది. ఇప్పటికైనా అధికారులు నమూనా ఆలయం ముందు చదును చేసి, వాన నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


