కనుల విందుగా.. విరుల పండగ | - | Sakshi
Sakshi News home page

కనుల విందుగా.. విరుల పండగ

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

అన్నవరం : సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాల్లో చివరి రోజయిన శనివారం రాత్రి శ్రీపుష్పయాగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నిండయిన పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుద్దీపాలంకరణల నడుమ నిత్య కల్యాణ మండపంలో రాత్రి 7 గంటలకు జరిగిన ఈ ఉత్సవాన్ని వేలాది మంది భక్తులు కన్నులారా తిలకించి తన్మయులయ్యారు. పండితులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ ఎన్‌.సూర్యచక్రధరరావులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన ఊయలపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో కొలువుదీరిన సత్యదేవుడు, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో పూజలు చేశారు. ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి, భక్తులు పులకించారు.

కిక్కిరిసిన ఆలయం

వేలాదిగా వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం కిక్కిరిసిపోయింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరి పైన, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయం కిటకిటలాడింది. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. సుమారు 2 వేల వ్రతాలు జరిగాయని, 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement