పోలీస్‌ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యా యత్నం | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యా యత్నం

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

కాకినాడ క్రైం: స్థానిక టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలం కొప్పవరం గ్రామానికి చెందిన పండ్రాడ చరణ్‌ సర్పవరం బినోయ్‌ జూనియర్‌ కళాశాలలో ఎంఎల్‌టీ చదివాడు. అదే గ్రామానికి చెందిన పరమేశ్వరరావు కాకినాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోం గార్డుగా పని చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఈకోలు నికితను చరణ్‌ ప్రేమించాడు. వారిద్దరూ గత గురువారం అన్నవరంలో ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు. అనంతరం నికితను చరణ్‌ పిఠాపురంలోని తన అమ్మమ్మ తిరగటి సంకురమ్మ ఇంటికి తీసుకెళ్లి అక్కడే ఉంచాడు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో చరణ్‌, నికితలతో పాటు చరణ్‌ తల్లి అపర్ణ ఆ ఇంట్లో ఉండగా కాకినాడ టూ టౌన్‌ పోలీసులు అక్కడకు వెళ్లారు. యువతీ యువకులిద్దరినీ జీపు ఎక్కించుకోగా అపర్ణ కూడా వారి వెంటే వెళ్లింది. ఉదయం 11.30 సమయంలో టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి, యువతిని ప్రత్యేకంగా ఏసీ గదిలోను, చరణ్‌ను లాకప్‌లోను ఉంచారు. పరమేశ్వర్‌తో పాటు యువతికి బావ వరుస అయ్యే వ్యక్తి లాకప్‌లోకి వెళ్లారు. అక్కడ వారు తన కుమారుడు చరణ్‌ను కొట్టారని, చంపాలని చూశారని తల్లి అపర్ణ ఆరోపిస్తోంది. వారి చిత్ర హింసలు భరించలేక, యువతి దూరమవుతుందేమోనన్న ఆవేదనతో తన కుమారుడు జేబులో ఉన్న నడుమునొప్పి మాత్రలు ఒకేసారి 10 మింగి అపస్మారక స్థితికి వెళ్లాడని చెబుతోంది. లాకప్‌లో స్పృహ కోల్పోయిన చరణ్‌ను పోలీసులు తమకు అప్పగించారని, కాకినాడ జీజీహెచ్‌కు తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.

పోలీసులేమన్నారంటే..

తన కుమార్తె కనిపించడం లేదని, చివరిసారి వీర్‌కమల్‌ థియేటర్‌ సమీపాన మిస్‌ అయిందని నికిత తండ్రి అయిన హోం గార్డు పరమేశ్వరరావు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా చరణ్‌, నికితలు పిఠాపురంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కాకినాడ టూ టౌన్‌కు తీసుకువచ్చారు. స్టేషన్‌లో చరణ్‌ విటమిన్‌–సి మాత్రలు మింగాడు. పోలీసులు ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపి, చికిత్స కోసం జీజీహెచ్‌కు పంపారు. ఈ ఘటనపై కాకినాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement