భావనారాయణ స్వామికి హైకోర్టు న్యాయమూర్తి పూజలు | - | Sakshi
Sakshi News home page

భావనారాయణ స్వామికి హైకోర్టు న్యాయమూర్తి పూజలు

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

కాకినాడ రూరల్‌: సర్పవరంలోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన వారికి దేవస్థానం ఆధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని, పూజలు అనంతరం, పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రాపాక శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

ఆస్తి వివరాల స్వీయ

నమోదుతో ప్రయోజనం

కాకినాడ లీగల్‌: ఆన్‌లైన్‌ ద్వారా ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు క్రయవిక్రయదారులకు ఓటీపీ వస్తుందని, ఆ తర్వాత ఆస్తి వివరాలు స్వయంగా నమోదు చేయడం ద్వారా ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్ల(ఈసీ)లో ఎటువంటి తప్పులూ రావని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) సీహెచ్‌ జానకీదేవి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్తుల కొనుగోలు సమయంలో ఈసీని పరిశీలిస్తే ఆ ఆస్తిపై అప్పులున్నాయా, ఇంతకు ముందు ఎవరికై నా విక్రయించారా, రిజిస్ట్రేషన్‌ వివరాలు తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈసీలు పరిశీలించుకోవచ్చన్నారు. ఐజీఆర్‌ఎస్‌ వైబ్‌సైట్‌ ద్వారా ఆస్తి రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేకపోవడంతో క్రయవిక్రయదారులు నెట్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని, ఆ క్రమంలో కొన్ని తప్పులుంటున్నాయని కాకినాడ దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు డీఐజీ దృష్టికి తీసుకువచ్చారు. ఆన్‌లైన్‌లో ఆస్తి వివరాలు తప్పుగా నమోదు చేసినప్పటికీ సరి చేయడానికి గత ప్రభుత్వ హయాంలో సబ్‌ రిజిస్ట్రార్‌కు అనుమతి ఉండేదన్నారు. సుమారు ఏడాది నుంచి ఈ అనుమతిని రద్దు చేయడంతో క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆన్‌లైన్‌లో ఆస్తి వివరాలు తప్పుగా నమోదు చేసినప్పటికీ సరి చేసేందుకు సబ్‌ రిజిస్ట్రార్‌కు గతంలో మాదిరిగానే అనుమతి ఇవ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement