ఓ మెట్టు ఎక్కారు | - | Sakshi
Sakshi News home page

ఓ మెట్టు ఎక్కారు

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

‘ఓపెన్‌’ ఫలితాల విడుదల

‘పది’లో గత ఏడాది 15వ స్థానం ఈసారి 14

86.08 శాతం ఉత్తీర్ణత గత ఏడాదికంటే కాస్త మెరుగుదల

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయి టాప్‌ టెన్‌లో నిలపాలనే అధికారుల ఆశలు ఆవిరయ్యాయి. ఉత్తీర్ణత శాతం కాస్త పెరిగినా.. గత ఏడాది కంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా ఒక్క మెట్టు మాత్రమే ఎక్కగలిగింది. పొరుగునే ఉన్న కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో 2, తూర్పు గోదావరి 9వ ర్యాంకులు సాధించి టాప్‌ టెన్‌లో స్థానం పొందగా మన జిల్లా మాత్రం 14వ ర్యాంకుకే పరిమితమైంది. గత నెల 16 నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకూ నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 28,289 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 24,347 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 82.02 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్ర స్థాయిలో 15 స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ ఏడాది 86.08 శాతం ఉత్తీర్ణతతో కాస్త మెరుగుపడి, 14వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.

బాలికలదే పైచేయి

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మొత్తం బాలికలు 14,357 మంది ఈ పరీక్షలకు హాజరవగా 12,609 మంది (87.84 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 13,932 మంది హాజరు కాగా, 11,738 మంది (84.26 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 20,034 మంది ప్రథమ, 3,091 మంది ద్వితీయ, 1,222 మంది తృతీయ శ్రేణుల్లో ఉత్తీర్ణులయ్యారు. టెన్త్‌లో మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించినా.. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ ఆశించినట్టుగా లేకపోవడంతో అధికారులు కాస్త నిరుత్సాహపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ఫలితాలు సైతం గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగానే లభించడం గమనార్హం. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు.

రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలిలా..

జిల్లా వ్యాప్తంగా 3,942 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో తప్పారు. వీరితో పాటు పరీక్షల్లో పాసై, మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తున్నవారు పునర్మూల్యంకనం (రీ వెరిఫికేషన్‌) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మే నెల 1 నుంచి ఏడో తేదీ రాత్రి 11 గంటల్లోగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రీ కౌంటింగ్‌కు గాను ప్రతి సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000 చెల్లించాలి. రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసిన వారి మార్కులు మళ్లీ ఒకసారి లెక్కిస్తారు. తప్పుగా ఉంటే ఆ మార్కులు మళ్లీ కలుపుతారు. అంతే తప్ప పేపర్‌ ఇవ్వరు. అదే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే మాత్రం స్కానింగ్‌ చేసిన జవాబు పత్రాలను విద్యార్థికి అందిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్‌ 4వ తేదీ వరకూ నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఫలితాలు కూడా గురువారం విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 1,593 మంది హాజరు కాగా 668 మంది (41.93 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు 6,003 మంది హాజరవగా 2,893 మంది (48.19 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన వారికి మే 25 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, సమీప పాఠశాలల్లో ఫీజు చెల్లించాలని జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ పి.సాయి వెంకట రమణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement