పిఠాపురం: పూర్తిగా శిథిలమైపోవడంతో తాళ్లు కట్టిన, గాల్లో వేళ్లాడుతున్న గేట్లు.. చిట్టడిలా పెరిగిపోయిన గుర్రపుడెక్క, గడ్డి మొక్కలు.. మూసుకుపోయిన కల్వర్టులు.. ముందుకు పారని నీరు.. ఇదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్స్ దుస్థితి. ఈ కాలువల కింద నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది రైతులు దాదాపు 42 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కాలువలు పూడుకుపోవడం, గేట్లు, స్లూయిజ్‌లు శిథిలమవడం, కల్వర్టులు, తూములు మూసుకుపోవడంతో భారీ వర్షాల సమయంలో పంట పొలాలను నీరు ముంచెత్తుతోంది. మామూలు రోజుల్లో నీరు సక్రమంగా ప్రవహించక పంటలు ఎండిపోతున్న దుస్థితి. ప్రస్తుతం పంట కాలం ముగియడంతో ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి రబీ సాగుకు నీటి విడుదలను నిలిపివేసి దాదాపు పక్షం రోజులు కావస్తోంది. నీరు లేకపోవడంతో ఈ సమయంలో సాధారణంగా కాలువల్లో పూడికలు తొలగించడం, గేట్లకు మరమ్మతుల వంటి క్లోజర్ పనులు చేస్తూంటారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ పనుల సంగతే పట్టించుకోవడం లేదు. దీంతో, ఏలేరు, పీబీసీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల్లో అధికారులు కాలువలకు మళ్లీ నీరు విడుదల చేస్తారు. క్లోజర్ పనుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది కూడా తమకు నష్టాలు తప్పవేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


