మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలి

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

పిఠాపురం రూరల్‌: మండలంలోని రాపర్తి చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని వైఎస్సార్‌ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎంపీ వంగా గీత డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులతో కలసి రాపర్తి చెరువును బుధవారం పరిశీలించిన ఆమె.. మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న చోట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 70 ఎకరాల విస్తీర్ణం కలిగిన రాపర్తి చెరువు కింద సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. వారం రోజులుగా ఈ చెరువులోని మట్టిని భారీ యంత్రాలతో తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మైనింగ్‌, రెవెన్యూ అధికారులు తమకు సంబంధం లేదంటున్నారని, ఇరిగేషన్‌ అధికారులను ప్రశ్నిస్తే కేవలం మూడడుగులు తవ్వేందుకు మాత్రమే.. అది కూడా రాయవరం చెరువుకు మాత్రమే అనుమతి ఇచ్చామని చెబుతున్నారని వివరించారు. అక్రమార్కులు చెరువును తవ్వేస్తూ లారీ మట్టిని రూ.5 వేలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందని గీత ప్రశ్నించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇటుక బట్టీల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారని, ఈ మట్టిని ఇటుక బట్టీలకు, రైతులకు, అవసరమైన ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అక్రమ తవ్వకాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. గతంలో ఇదే మట్టి మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారని, ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాపర్తి, రాయవరం చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ చెరువుల్లో తవ్విన మట్టిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే సహించేది లేదని, నర్సింగపురంలో పేదలకు కేటాయించిన 60 ఎకరాల లే అవుట్‌ అభివృద్ధికి వినియోగించాలని గీత కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement