పిఠాపురం రూరల్: ఇంధన కొరత పాపం ప్రభుత్వానిదేనని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ కొరత కారణంగా అన్ని రంగాల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని కొరత మన రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇంధన కొరత లేదన్న అధికారులు.. వాహనాలకు మాత్రం రూ.200, రూ.500 విలువైన పెట్రోలు, డీజిల్ మాత్రమే పోయాలని, బాటిళ్లలో వేయవద్దని ఆదేశాలిచ్చారని, కొంతసేపటికే నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయని చెప్పారు. ఎటువంటి కొరతా లేదని మంత్రులు కూడా ప్రకటనలు ఇచ్చారని.. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే కొరత సృష్టించినట్లు కనిపిస్తోందని అన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతోందని తెలియగానే అన్ని బంకులూ తెరచుకోవడం ప్రారంభమైందన్నారు. మరోసారి ఇటువంటి కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు చేపట్టాలని గీత డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు గండేపల్లి రామారావు (బాబీ), పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, నాయకులు కొత్తెం దత్తుడు, బత్తుల సాయి, పెదపాటి రాజేష్, తలిశెట్టి వెంటేశ్వరరావు, రావు చిన్నారావు, ఆనాల సుదర్శన్, అలీ, మొయిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి రాక
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్‌కు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ బుధవారం స్వాగతం పలికారు. స్థానిక హోటల్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం, మంత్రి బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు కూడా ఉన్నారు.


