బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వేలాదిగా క్రైస్తవులు కాకినాడలో బుధవారం ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యాన స్థానిక భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొమ్మేటి శామ్యూల్ సాగర్, జోషఫ్ బెన్నీ మాట్లాడుతూ, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు వారికి సంఘీభావం తెలుపుతూ క్రైస్తవుల న్యాయ పోరాటానికి తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ర్యాలీ, ధర్నా అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.


