ప్రకృతి సాగుకు ఉత్సాహాన్నిచ్చారు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సాగుకు ఉత్సాహాన్నిచ్చారు

Feb 26 2026 8:33 AM | Updated on Feb 26 2026 8:33 AM

ప్రకృతి సాగుకు ఉత్సాహాన్నిచ్చారు

ప్రకృతి సాగుకు ఉత్సాహాన్నిచ్చారు

జిల్లా కలెక్టర్‌ కీర్తి

మాజీ స్పెషల్‌ సీఎస్‌ విజయ కుమార్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రకృతి వ్యవసాయానికి కొనుగోలుదారులు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారని కలెక్టర్‌ కీర్తి అన్నారు. బుధవారం ప్రకృతి వ్యవసాయంపై స్థానిక జేఎన్‌రోడ్డు లోని సూర్య గార్డెన్స్‌లో కొనుగోలుదారులు – విక్రేతల అనుసంధాన సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్‌టీఆర్‌, కోనసీమ, కృష్ణా, కాకినాడ (డెల్టా ప్రాంతం) జిల్లాలకు చెందిన బీఆర్‌సీ (బయో రిసోర్స్‌ సెంటర్‌) ఉత్పత్తులు, స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కీర్తి మాట్లాడుతూ డెల్టా ప్రాంత రైతులు, అగ్రిగేటర్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, సర్వీస్‌ ప్రొవైడర్లు పరస్పర అనుసంధానం కావడానికి ఈ సమావేశం వేదికగా నిలిచిందన్నారు. రైతు ఉత్పత్తులకు ప్రత్యక్ష మార్కెటింగ్‌ కల్పించడమే లక్ష్యంగా ఈ నెట్‌ వర్కింగ్‌ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రకృతి సాగు ద్వారా రసాయన రహిత, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించవచ్చన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మాత్రమే కాకుండా మార్కెటింగ్‌ వైపు కూడా దృష్టి సారించాలని సూచించారు. వినియోగదారుడికి నేరుగా అనుసంధానం ఏర్పడితే రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. మాజీ స్పెషల్‌ ప్రధాన కార్యదర్శి, రైతు సాధికార సమితి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, టి.విజయ్‌కుమార్‌ జూమ్‌ ద్వారా సమావేశంలో పాల్గొని రైతులు, వ్యాపారవేత్తలు, కొనుగోలు దారులతో ప్రత్యక్షంగా మాట్లాడి విత్తనం నుంచి పంట కోత వరకు ప్రకృతి సాగు విధానాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్‌ పాల్‌ ప్రతి రైతు ఉత్పత్తి దశతో పాటు మార్కెటింగ్‌ దశలోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. రైతు ఒక ఉత్పత్తిదారుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ఆలోచించే దిశగా ముందుకు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement