నేత్రపర్వంగా భీమేశ్వరుని జల విహారం
● ఆలయ పుష్కరిణి చుట్టూ జన సందోహం
● భారీ ఎత్తున బాణసంచా కాల్పులు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రంలోని బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామ భీమేశ్వరస్వామి జల విహారం బుధవారం రాత్రి నేత్ర పర్వంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలు, స్వామి వారి కల్యాణం సందర్భంగా ఈ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. గతంలో కార్తిక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకొని ఏటా ఆలయ కోనేరులో ఈ కార్యక్రమం నిర్వహించేవారు. అయితే స్వామి వారి కల్యాణం సందర్భంగా తెప్పోత్సవం నిర్వహించాలనే పండితుల సూచనల మేరకు శ్రీ పుష్పయోగోత్సవానికి ముందు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 13న స్వామివారి కల్యాణం జరిగిన విషయం విదితమే. దీనిలో భాగంగా రాత్రి ఆలయం చుట్టూ పల్లకీలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను బ్యాండ్ మేళాలు, వేద మంత్రాల మధ్య ఊరేగింపు నిర్వహించి ఆలయ కోనేరు వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకొనివచ్చారు. పూలతో అలంకరణ చేసిన వేదికపై స్వామి, అమ్మవారి విగ్రహాలను ఉంచి ఆలయ పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్‌మోహన్‌రావు దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. బాణసంచా కాల్పుల మధ్య స్వామి, అమ్మవార్లను ఆలయ కోనేరులో విద్యుత్తు దీపాలంకరణతో ఏర్పాటు చేసిన హంస వాహనంపై ఉంచి వేద పండితుల ఆధ్వర్యంలో జల విహారం కార్యక్రమం నిర్వహించారు. మూడు పర్యాయాలు కోనేరులో ఈ జలవిహారం జరిగింది. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
వైభవంగా శ్రీపుష్పయాగం
స్వామివారి శ్రీపుష్పయాగం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. జల విహారం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కల్యాణ వేదిక వద్దకు మేళతాళాలతో తీసుకొచ్చారు. వేదికపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారి ఆలయాన్ని పూలతో అలంకరణ చేశారు. పూలు, వివిధ రకాల పండ్లు, మిఠాయిలతో అలంకరించిన ఊయలలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచారు. ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్‌మోన్ దంపతులు, ఈఓ బళ్ల నీలకంఠం దంపతులకు దంపత తాంబూలాలు అందజేశారు. శ్రీసత్యకృష్ణ కూచిపూడి కళానిలయం ఆధ్వర్యంలో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.
నేత్రపర్వంగా భీమేశ్వరుని జల విహారం


