
లలితా నామం.. ఎంతో మాహాత్మ్యం
● శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి
● 40 కోట్లకు చేరిన కుంకుమార్చనలు
కాకినాడ రూరల్: లలితా నామంలో ఎంతో మాహాత్మ్యం ఉందని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. రమణయ్యపేట శ్రీపీఠంలో మహాశక్తి యాగం గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. వంద కోట్ల కుంకుమార్చనల క్రతువులో భాగంగా నాలుగు రోజులకు 40 కోట్ల అర్చనలు పూర్తయ్యాయని స్వామీజీ ప్రకటించారు. అమ్మను ఆరాధిస్తే ప్రకృతి మన పక్కనే ఉంటుందన్నారు. సకల సృష్టికి అమ్మ నిలయమని, సృష్టి మొత్తం సీ్త్రమయమని చెప్పారు. పంచభూతాల్లో సైతం సీ్త్ర లింగం ఉందన్నారు. అమ్మవారిని కొలిచేందుకు భక్తులు శ్రీపీఠం వస్తున్నారని, వారి సంకల్పం నెరవేరాలంటే అనవసరమైన మాటలు తగ్గించుకుని సద్భావనతో ఉండాలని సూచించారు. కుంకుమార్చనల్లో అన్ని మంత్రాలూ వింటూ వీలైనంత సమయం అమ్మవారిని స్మరించుకోవాలని అన్నారు. ఈ నెల 29న 24 వేల మంది విద్యార్థులతో త్రికోటి మహా సరస్వతి పూజతో పాటు సామూహిక అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. మహాశక్తి యాగంలో పాల్గొనేందుకు వేలాదిగా వస్తున్న భక్తులకు తమ శక్తికొద్దీ అద్భుతమైన ఔషధాలు కలిిపి మహా అన్న ప్రసాదం అందిస్తున్నామని స్వామీజీ తెలిపారు. అంతకు ముందు యాగ వేదిక వద్ద ఉదయం గాయత్రి, సౌర హోమం, కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం ఐశ్వర్యాంబికా అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చనలకు ముందు సినీ సంగీత దర్శకుడు నాగరాజు వేణుగానంతో అమ్మవారి గీతాలు వినిపించి అలరించారు.

లలితా నామం.. ఎంతో మాహాత్మ్యం