
వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారి
కాకినాడ క్రై: సాధారణ గస్తీలో భాగంగా కాకినాడలో భద్రతను పర్యవేక్షిస్తున్న కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. సర్పవరంలోని విశాఖ డైయిరీ సమీపంలో మంగళవారం తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో ఒక వ్యక్తి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో అతడికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. గస్తీలో భాగంగా అటుగా వెళ్లిన సీఐ సునీల్ కుమార్ ఆ వ్యక్తిని చూశారు. వెంటనే మంచినీరు తాగించి, సపర్యలు చేసి కూర్చోబెట్టారు. నీరసంతో పడిపోయానని అతడు చెప్పడంతో పోలీసులు సురక్షిత ప్రాంతానికి చేర్చి, ఓఆర్‌ఎస్ ద్రావణాలు కొని ఇచ్చారు. కాగా.. రోడ్డుపై పడిఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన సునీల్ కుమార్‌ను ఎస్పీ బిందుమాధవ్, డీఎస్పీ దేవానంద్ పాటిల్ అభినందించారు.