
గోదారి తీరాన సంగీత, నృత్యోత్సవం
● నేటి నుంచి అంతర్జాతీయ
సంగీత, నృత్య ఫెస్ట్–2025
● నాలుగు రోజుల పాటు
సాగనున్న ఉత్సవాలు
● 13 రాష్ట్రాల నుంచి కళాకారుల రాక
● మలేషియా నుంచి రానున్న ప్రత్యేక బృందం
● 13వ తేదీన 134 మందితో
నృత్య నీరాజనం
సీటీఆర్‌ఐ: నృత్య నీరాజనంతో గోదారితీరం పులకించనుంది. వంద మందికి పైగా నృత్య కళాకారులు ఒకే వేదికపై నాలుగు రోజులపాటు నగర ప్రజలను పరవశింపజేయనున్నారు. 42 ఏళ్లుగా కళా సమ్మేళన్ పేరితో సంగీత, నృత్యోత్సవాలు నిర్వహిస్తున్న శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర, భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 43వ కళా సమ్మేళన్ అంతర్జాతీయ సంగీత, నృత్య ఫెస్ట్–2025 గురువారం వైభవంగా ప్రారంభం కానుంది.
ఈ సమ్మేళన్‌లో 13 రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొననున్నారు. వీరితో పాటుగా మలేషియా నుంచి ఒక ప్రత్యేక బృందం రానుంది. సుమారు 550 మంది కళాకారులు మూడు రోజుల పాటు సంగీతం, నృత్య, జానపద కళారూపాలతో పోటీ పడనున్నారు. శుక్రవారం 134 మంది తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకండ్ల పాటు నిర్విరామంగా ఒకే ఆహార్యంతో నృత్యం చేయనున్నారు. వీరితో పాటు 9 మంది సంగీత విద్యాంసులు కూడా పాల్గొనున్నారు. ఈ నృత్యోత్సవాన్ని పలు రికార్డులకు నమోదు చేయనున్నారు. గత ఏడాది అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవం అనేక రికార్డులను సొంతం చేసుకుంది. 12 గంటల 23 నిమిషాల 01 సెకండ్ పాటు 125 మంది కళాకారులు ఒకే ఆహార్యంతో ప్రదర్శించిన హనుమాన్ చాలీసా నృత్యరూపకానికి 12 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్, వండర్ బుక్, తెలుగు బుక్, గోల్డెన్‌బుక్ వంటి 12 వరల్డ్ రికార్డులను ఆ కార్యక్రమం సొంతం చేసుకోవడం విశేషం. 14వ తేదీ 13న బృందాలు పోటీ పడనున్నాయి. ఒక్కొక్క
బృందంలో 25 నుంచి 30 మంది వరకు కళాకారులు పాల్గొననున్నారు. 15వ తేదీ సోలో పోటీలు, సర్టిఫికెట్ల ప్రదానం చేయనున్నారు.
శాసీ్త్రయ నృత్యానికి ఆదరణ కరవు
పాశ్చాత్య సంగీతం, నృత్యం వైపు నేటి తరం ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. తల్లితండ్రులు కూడా త్వరగా తమ పిల్లలకు పేరు వస్తుందనే ఆశతో పాశ్చాత్య నృత్యం వైపు తమ పిల్లలను పంపుతున్నారు. టీవీ షోలలో అసభ్యకరమైన విన్యాసాలతో, పొట్టి డ్రెస్‌లతో చేసేది నాట్యమని భ్రమిస్తున్నారు. మన ప్రాచీన కళైన సంప్రదాయ నృత్యం వైపు ప్రపంచం చూస్తోంది. మనం మాత్రం ఆధునిక పొకడలతో తలతోక లేని డ్యాన్స్ వైపు పరుగెడుతున్నాం.
– డాక్టర్ జీబీ నారాయణ, శ్రీరాధాకృష్ణ కళాకేత్ర వ్యవస్థాఫకుడు

గోదారి తీరాన సంగీత, నృత్యోత్సవం

గోదారి తీరాన సంగీత, నృత్యోత్సవం