
కారు ఢీకొని మహిళ మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై జీఎస్‌ఎల్ జనరల్ ఆస్పత్రి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కలవచర్లకు చెందిన యర్రా మాణిక్యం (54) కంటి చూపు సరిగా కనిపించక ఇబ్బంది పడుతోంది. కంటి పరీక్ష చేయించుకుందామని జీఎస్‌ఎల్ ఆస్పత్రికి వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైంది. టు వే గా ఉన్న రహదారిపై డివైడర్ దాటి అవతలి వైపుకు వెళ్తుండగా రాజమహేంద్రవరం నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై నాగార్జున తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముగ్గురు పిల్లలకు వివాహాలు చేశారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మోటార్ బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
గండేపల్లి: వర్షం కారణంగా మోటారు బైక్ అదుపు తప్పడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎసై యూవీ శివనాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లికి చెందిన షేక్ నాగూర్ సాహెబ్ (57) రాజానగరంలోని గైట్ కళాశాలలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం మోటార్ సైకిల్‌పై డ్యూటీకి బయలుదేరారు. వర్షం పడుతున్న సమయంలో మురారి శివారు మాతారాణి దాబా ఎదురుగా మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజానగరం జీఎస్‌ఎల్‌కు, అక్కడి వైద్యుల సూచనల మేరకు కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. నాగూర్ సాహెబ్‌కు భార్య నూర్జహాన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కారు ఢీకొని మహిళ మృతి