
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొత్తపేట: అవిడి పెదపేట గ్రామానికి చెందిన నామాడి సుధాకర్ అలియాస్ బుజ్జి (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అవిడి రేవు సమీపంలో పంట కాలువ కల్వర్టు గోడపై అతడు మృతి చెంది ఉండటాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్‌కు భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉండగా, పెద్ద కుమార్తె ఎంసెట్ పరీక్ష రాసింది. చిన్న కుమార్తె పదో తరగతి పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న సుధాకర్ మంగళవారం ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు. రాత్రి 9 గంటల సమయంలో పంట కాలువ కల్వర్టు వద్ద అతడు మద్యం మత్తులో ఉండగా స్థానికులు చూశారు. ఉదయానికి రక్తపు వాంతులు చేసుకుని చనిపోయి ఉండగా గుర్తించి, అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్నయ్య నామాడి రవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.