
నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకం
మలికిపురం: నేరాల దర్యాప్తు, పరిశోధనలలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని, అందుకే ప్రతి కూడళ్లలో వాటిని ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం మలికిపురం పోలీస్ స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల జరిగిన అనేక నేరాలు, చోరీ కేసులలో నేరస్తుల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. అన్ని ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాలు కూడా సహకరించాయన్నారు. జిల్లాలో గంజాయి నేరాలు తగ్గాయని, ఈ కేసులలో పాత నేరస్తులపై నిఘా ఉంచి కట్టడి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాసంఘాలకు సూచించామన్నారు. గల్ఫ్ ఉద్యోగాల పేరుతో కోనసీమలో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. లైసెన్స్ కలిగిన ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ సుంకర మురళీ మోహన్, సీఐ నగేష్ కుమార్, ఎస్సైలు పీవీఎస్‌ఎస్‌ఎన్ సురేష్, రాజేష్ కుమార్, కె.దుర్గా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.