
సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాకినాడ డిపో నుంచి ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సరస్వతీ దాయం – పుష్కరయాత్ర పేరిట స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ బస్సు కాళేశ్వరంలో పుణ్యస్నానాలు, మహాకాళ్వేరుని దర్శనం అనంతరం రామప్ప దేవాలయం, వరంగల్లు వేయి స్తంభాల మంటపం, భద్రకాళీ దర్శనం, ధర్మపురిలో స్నానాలు, లక్ష్మీనరసింహస్వామి దర్శనం, కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం, వేములవాడ క్షేత్ర దర్శనం అనంతరం ఈనెల 18న ఉదయానికి కాకినాడ చేరుకుంటుందన్నారు. ఈ నెల 22న సూపర్ లగ్జరీ బస్సు బయలు దేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కాలం చెల్లిన బీరు బాటిళ్ల ధ్వంసం
తాళ్లపూడి: తుపాకులగూడెం పరిధిలోని ఎలియస్ బేవరెజన్ ప్రైవేటు లిమిటెడ్‌లో కాలం చెల్లిన 9,193 కేసుల బీరు బాటిళ్లను ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ కేవైఎంబీ కుమార్ తెలిపారు. ఆ ఫ్యాక్టరీలో కాలం చెల్లిపోయి నిల్వ ఉన్న బీరులను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గురువారం అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ బి.స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు గామన్ బ్రిడ్జి అండర్ పాస్ సర్వీస్ రోడ్డు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరుకు చెందిన దాసరపూడి సుధ (45) తన కుమారుడు చరణ్‌తో కలిసి దొమ్మేరు నుంచి కొవ్వూరుకు మోటార్ బైక్‌పై వస్తున్నారు. కొవ్వూరు అండర్ పాస్ సర్వీస్ రోడ్డుకు వచ్చేసరికీ వారిని వెనక నుంచి ఇసుక లారీ ఢీకొంది. రోడ్డుపై పడిన సుధ మీద నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ సీఐ విశ్వం చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. సుధ భర్త సాయికృష్ణ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు.
చెక్కు బౌన్స్ కేసులో జరిమానా, జైలు
కాకినాడ లీగల్: చెల్లని చెక్కులు ఇచ్చి ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి న్యాయస్థానం జరిమానా, జైలు శిక్ష విధించింది. కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మి కుమారి ఈ మేరకు తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కేబీ ప్రతాప్ కుమార్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన దూడల శ్రీనివాసరావు వ్యాపార అవసరాల కోసమని కాకినాడలోని వెంకటరత్నంపురానికి చెందిన వెంట్రాప్రగడ మురళీ వద్ద అప్పు తీసుకున్నాడు. ఇందుకోసం శ్రీనివాసరావు రూ.1,40,66,666 విలువైన ఒక చెక్కు ఇచ్చారు. సమయానికి అప్పు తీర్చక పోవడంతో చెక్కును మురళీ బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అయ్యింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు విచారణలో శ్రీనివాసరావుపై నేరం రుజువు కావడంతో 18 నెలల జైలు, రూ.1,40,66,666లు పరిహారంగా చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. కాగా, ఇదే శ్రీనివాసరావు మురళీకి ఇచ్చిన మరో చెక్కు కూడా బౌన్స్ అయ్యింది. దీనిలో శ్రీనివాసరావుకు 18 నెలల జైలు, రూ.3.60 కోట్లు పరిహారం విధిస్తూ తీర్పు వెలువడింది.