
పీజీఆర్‌ఎస్‌కు 373 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 373 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్‌ఓ వెంకటరావు, జెడ్పీ సీఈఓ వీవీ లక్ష్మణరావు, హౌసింగ్ బోర్డు పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, సీపీఓ పి.త్రినాథ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎండార్స్‌మెంట్ చేయాలని సూచించారు. సక్రమంగా పరిష్కరించని వాటిని రెండు స్థాయిల్లో ఆడిట్ జరిపి, రీ ఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ రీ ఓపెన్ చేసిన శాఖ అధికారులకు మెమోలు జారీ చేస్తారని హెచ్చరించారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే 1100 నంబర్‌కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు.
సీహెచ్‌ఓల భిక్షాటన
కాకినాడ సిటీ: తమ డిమాండ్ల పరిష్కారానికి గత పది రోజులు నుంచి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌ఓ) సోమవారం భిక్షాటన చేశారు. మానవ హారంగా ఏర్పడి ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని నినదించారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు వైద్యం చేస్తున్న సీహెచ్‌ఓలు ఇలా భిక్షాటన చేయడంతో ప్రజలు వారి పట్ల సానుభూతి ప్రకటించారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 47 ఫిర్యాదులు
కాకినాడ క్రైం: తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 47 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులను ఆయన నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వర్గీకరణలో
మాదిగలకు అన్యాయం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ వర్గీకరణ అమలులో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలో మాలలకు 8 శాతం, మాదిగలకు 6 శాతం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాదిగలకు చంద్రబాబు అన్యాయం చేస్తూంటే మంద కృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా మాదిగలు పోరాటం చేస్తే, ఫలాలు మాలలకు అందించడం దురదృష్టకరమన్నారు. వర్గీకరణ అమలులో మాల, మాదిగలకు చెరో 7 శాతం, ఉప కులాలకు ఒక శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఉమ్మడిగా కాకుండా ఎ, బి, సి, డి గ్రూపులుగా కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, జూన్ 5న అమరావతిలో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెంకటేశ్వరరావు చెప్పారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బలంకుల రాజు తదితరులు పాల్గొన్నారు.
సరస్వతీ నదీ పుష్కరాలకు
ప్రత్యేక బస్సులు
రావులపాలెం: సరస్వతీ నదీ పుష్కరాలకు రావులపాలెం ఆర్‌టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ జీజీవీ రమణ సోమవారం తెలిపారు. రావులపాలెం డిపో నుంచి వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప దేవాలయాల దర్శనాలతో పాటు సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేసే విధంగా రెండు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఈ నెల 15 తేదీన రావులపాలెం నుంచి బయలుదేరుతున్నట్టు తెలిపారు. ప్రయాణికుల నుంచి విశేష స్పందన ఉన్న కారణంగా ఈ నెల 20వ తేదీన మరో రెండు బస్సులు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 373 అర్జీలు