
పదోన్నతుల కోసం ఏఎన్‌ఎంల ధర్నా
కాకినాడ క్రైం: అర్హులైన తమకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఎన్‌ఎంలు నిరసన బాట పట్టారు. సోమవారం సాయంత్రం కాకినాడలోని కార్యాలయ ఆవరణలో ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంయుక్తాధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అస్కరరావు, శ్రీకాంత్‌రాజు మాట్లాడుతూ, ఏఎన్‌ఎంలకు పదోన్నతులు కల్పించడంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదోన్నతులపై తాత్సారం చేయడం తగదన్నారు. డీఎంహెచ్‌వో సహా డిప్యూటీ డెమో వైఖరే ఇందుకు కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్‌వోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పందించిన డీఎంహెచ్‌వో మంగళవారం మెరిట్ లిస్ట్ ప్రదర్శించి, 22వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఏఎన్‌ఎంలు నిరసన విరమించారు.