ఆడపిల్ల అనా లేక అడ్డుగా ఉందనా!
సంచలనం రేపిన పసికందు మృతి ఘటనపై ఎన్నో అనుమానాలు
కేసును పక్కదోవ పట్టించేందుకే క్షుద్రపూజల నాటకమా?
పిఠాపురం: అన్నెంపుణ్యం తెలియని పసిగుడ్డును పొట్టన పెట్టుకున్నారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న పసికందు మృతి, క్షుద్ర పూజల ఆనవాళ్లు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ సంఘటనకు సంభందించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం జగ్గయ్య చెరువులో నివాసముంటున్న పెదపాటి సతీష్, శైలజ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి యశ్వంతి అనే ఆరునెలల పాప ఉంది. మంగళవారం రాత్రి శైలజ పెద్దమ్మ గంటా మరిడమ్మ పెదనాన్న గంటా రాంబాబులు మేడపై నిద్రించారు. తమ్ముడు పసుపులేటి లోవరాజు, తండ్రి పసుపులేటి దుర్గారావు, తల్లి అన్నవరంలతో కలిసి శైలజ, ఆమె కుమార్తె యశ్వంతి (6 నెలలు) కింద గదులలో నిద్రించారు. రాత్రి 12.30 గంటల సమయంలో పాపకు పాలిద్దామని చూసిన శైలజకు చిన్నారి కనపడకపోవడంతో పెద్దగా కేకలు వేసింది. దీంతో ఇంట్లోని వారందరూ, పక్కింటి వారు కూడా వచ్చి పాప కోసం ఇల్లంతా వెదికారు. చివరకు వారు బావిలో పడి ఉన్న పాపను, ఇంటి గుమ్మం మెట్లపై ఉన్న నిమ్మకాయ, పసుపు, కుంకాలను గమనించారు.
ఘోరానికి ఒడిగట్టిందెవరు..!
ఈ విషయాన్ని బంధువులకు చెప్పేందుకు శైలజ తల్లి అన్నవరం తన సెల్ కోసం వెతికి అది కనిపించకపోవడంతో వేరొక సెల్ నుంచి తన మొబైల్‌కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ ఇంటి గోడ అవతల రింగ్ అవుతూ కనిపించింది. దానిని తీసుకుని బంధువులకు విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకుని అక్కడ చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బావిలోని పాప మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో పరిసరాలను తనిఖీ చేశారు. పాప అమ్మమ్మ అన్నవరం వద్దకు వెళ్లి నిలవడంతో పాటు ఆమె ఫోన్ నూతి పక్కన దొరకడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు అన్నవరంను, ఆమెతో పాటు, కొందరు కుటుంబ సభ్యులను అనుమానితులుగా విచారిస్తున్నారు. శైలజ యానాదులు కాగా తండ్రి సతీష్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. వీరి ప్రేమ వివాహం నచ్చని శైలజ కుటుంబ సభ్యులు బాలిక మృతికి కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్షుద్ర పూజలు నాటకమేనా
ఆడ పిల్ల అనో, లేక అడ్డుగా ఉందనో పసికందును పొట్టన పెట్టుకున్న అగంతకులు ఎవరికీ అనుమానం రాకుండా క్షుద్ర పూజలు జరిగినట్లు చిత్రీకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుంకుమ, పసుపు నమూనాలు సేకరించి, ఇంటిలో ఉన్న పసుపు కుంకుమ ఒకటేనా అని పరిశీలించారు. కేసును తప్పుదోవ పట్టించడానికే క్షుద్ర పూజల నాటకం ఆడి ఉంటారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే చిన్నారి అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, తండ్రి తదితరులను అనుమానితులుగా విచారిస్తున్నారు.
బంతితో ఆడుతూ బావిలోకి.. ఏడేళ్ల బాలుడి మృతి
సామర్లకోట: బంతితో ఆడుతూ పొరపాటు బావిలో పడి ఒక చిన్నారి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం అయోధ్యరామపురానికి చెందిన చెవా హేమంత్ (7) బుధవారం సాయంత్రం తన ఇంటి సమీపంలో బంధువుల ఇంటి వద్ద బంతితో ఆడుతూ బావి సమీపంలోని సిమెంటు దిమ్మ ఎక్కాడు. బంతి బావి వైపు పోవడంతో దానిని అందుకునే క్రమంలో ఆ చిన్నారి బావిలో పడిపోయాడు. సుమారు 60 అడుగుల లోతులో బావి ఉండడంతో స్థానికులు దిగలేక పోయారు. దాంతో విద్యాకమిటీ చైర్మన్ నక్కా జానికిరామయ్య పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది బావిలోనికి దిగే ప్రయత్నం చేశారు. అయితే వారి వద్ద లైట్ లేక పోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పటికప్పుడు లైట్ ఏర్పాటు చేయడంతో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు బావిలోనికి దిగారు. బాలుడు బావిలోనికి పడిన సమయంలో అతని తలకు గాయం తగలడం, సుమారు రెండు గంటల సేపు బావిలో ఉండిపోవడంతో మృతి చెందాడు. బాలుడి తండ్రి సతీష్ ఏడీబీ రోడ్డులోని ఒక రెయ్యల చెరువు వద్ద పని చేస్తూ ఉంటాడు. తల్లి రాధ గృహిణి. హేమంత్ తాత సుబ్బారావు సాయంత్రం 6 గంటల సమయంలో ముంజులు తీసుకు వచ్చి తినరా అంటే ఇప్పుడే రెండు నిమిషాలల్లో వస్తానని చెప్పి వెళ్లిన మనవడు ఐదు నిమిషాలలో బావిలో పడిపోయాడనే వార్త వినాల్సి వచ్చిందని గుండెలు బాదుకుంటూ రోదించాడు. ఎస్సై మూర్తి తన సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాపేం చేసింది పాపం!

పాపేం చేసింది పాపం!