
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని ఆ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సోమవారం ఆమె సందర్శించారు. జైలులో ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వారి తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వేయాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా తమ సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారు. ఎవరైనా ఖైదీలు న్యాయ సహాయం కావాలని అనుకుంటే సంస్థ నియమించిన పారాలీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు అందించాలని సూచించారు. ముద్దాయిలు, ఖైదీల కోసం పని చేస్తున్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలని శ్రీలక్ష్మి అన్నారు.