
ఊడిమూడిలంక వంతెన పనుల పరిశీలన
పి.గన్నవరం: నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై నిర్మిస్తున్న వంతెన పనులను ఏఐఐబీ టీమ్ బుధవారం పరిశీలించింది. ఇంతవరకూ పనుల పట్ల టీమ్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజల కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.49.5 కోట్లు మంజూరు చేయించిన విషయం విధితమే. ఇంతవరకూ సుమారు రూ.32 కోట్ల వ్యయంతో 60 శాతం మేర పనులు పూర్తిచేశారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ఏఐఐబీ టీమ్ లీడర్ పవన్ ఖర్గీ (నేపాల్), సభ్యులు మాయా గాబ్రియల్ (ఫిలిప్పీన్), ఫ్రాన్సిస్ లార్ల సవెల్ల (ఫిలిప్పీన్), జోష్యుల శివరామశాస్త్రి (భారత్, ఏపీ), యోగేష్ బామ్ మల్ల (నేపాల్), ఎ.ముఖరాజ్ (కర్నాటక), అశోక్‌కుమార్ (డిల్లీ)లు వంతెన పనులను పరిశీలించారు. ఇంతవరకూ పనుల ప్రగతిని డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు బృంద సభ్యులకు వివరించారు.