
సెట్ చేసుకోవాలిలా..
ఫ ఏపీ ఈఏపీ సెట్‌కు 24 చివరి తేదీ
ఫ ఇప్పటికే 3,37,437 దరఖాస్తులు
ఫ వచ్చే నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు
ఫ 21 నుంచి 27 వరకూ ఇంజినీరింగ్ కోర్సులకు ఎంట్రన్స్ టెస్ట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు చదవడం ద్వారా జీవితంలో స్థిరపడేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే ఈ కోర్సులలో చేరేందుకు విద్యార్థులు, వారిని చదివించేందుకు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహపడుతూంటారు. ఈ కోర్సులలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీ సెట్–2025 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్‌కు 2,73,010 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీకి 87,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్మీడియెట్ పాసై, ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకు పొందిన విద్యార్థులు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఏపీ ఈఏపీ సెట్–2025 ఎంపిక చేసుకోవాలి. అందులో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, సూచనల మాన్యువల్ వంటి పూర్తి వివరాలు పొందవచ్చు.
ధ్రువపత్రాలు తప్పనిసరి
దరఖాస్తు సమయంలో వివిధ కేటగిరీల విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ (పీహెచ్) కేటగిరీల్లో తమకు సంబంధించిన వాటిని ఆన్‌లైన్ అప్లికేషన్‌లో సెల క్ట్ చేయాలి. అలాగే, సంబంధిత ధ్రు వపత్రం నంబరు నమో దు చేయాలి. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువపత్రాల నంబరు సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 1వ తేదీ తరువాత తీసుకున్న ధ్రువపత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
పరీక్ష కేంద్రం ఎంచుకోవాలిలా..
విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకూ ఏ విద్యాసంస్థల్లో, ఏ ఊరిలో చదివారనే వివరాలను ఆయా విద్యా సంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివరిలో ఈఏపీ సెట్ ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలి. ఈవిధంగా ఐదు ప్రాధాన్యతలు ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ, అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతరత్రా కారణాలతో ఆ కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాల్లో కేంద్రాన్ని కేటాయిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసి, సబ్‌మిట్ చేసిన తరువాత ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్ హాల్ టికెట్‌తో పాటు ఆన్‌లైన్ ప్రింటవుట్ కాపీపై ఫొటో అతికించి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
దరఖాస్తు చేసుకోవాలి
ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈఏపీ సెట్‌కు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ తేదీ దాటితే ఫైన్‌తో చెల్లించాలి.
ఇప్పటి వరకూ ఇంజినీరింగ్ విభాగంలో 2,63,708 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగంలో 72,966 మంది, రెండు విభాగాలకు కలిపి 763 మంది దరఖాస్తు చేసుకున్నారు.
– వీవీ సుబ్బారావు,
ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్
దరఖాస్తు ఇలా..
ఈఏపీ సెట్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయిన తరువాత ఐదు దశల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. స్టెప్–1 మొదలు స్టెప్–5 వరకూ ఐదు దశల్లో కనిపించే ట్యాబ్‌లను వరుస క్రమంలో క్లిక్ చేస్తూ, అడిగిన వివరాలు నమోదు చేయాలి.
స్టెప్–1: ఎలిజిబులిటీ క్రైటేరియా అండ్ ఫీజు పేమెంట్‌కు లాగిన్ అయి సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు నమోదు చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, ఈ–మెయిల్ ఐడీ ఇవ్వాలి. దీంతో పాటు ఇంజినీరింగ్–ఫార్మసీ, అగ్రికల్చర్–ఫార్మసీ, బోత్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒకటి ఎంపిక చేసుకోవాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరీపై క్లిక్ చేసి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.
స్టెప్–2: నో యువర్ పేమెంట్ స్టేటస్‌పై క్లిక్ చేసి, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి. అనంతరం చేరనున్న కోర్సుల వారీగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌లలో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవడంతో స్టెప్–2 ప్రక్రియ పూర్తవుతుంది.
స్టెప్–3: ఫిల్ అప్లికేషన్‌లో పేమెంట్ చేసిన ఐడీతో పాటు సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్–4: ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్‌పై క్లిక్ చేసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు.
స్టెప్–5: ఇక్కడ క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్, పుట్టిన తేదీ వివరాలు.. ఈఏపీ సెట్ హాల్ టికెట్, పరీక్షకు హాజరయ్యే సమయంలో కీలకంగా మారుతాయి.

సెట్ చేసుకోవాలిలా..

సెట్ చేసుకోవాలిలా..