అన్నవరం: సత్యదేవుని నూతన ఆలయానికి 13 సంవత్సరాలు పూర్తయి, 14వ ఏట అడుగు పెట్టిన సంద ర్భంగా రత్నగిరిపై శుక్రవారం ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ పండితులు సత్యదేవునికి లక్ష తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకుడు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, వ్రత పురోహితులు చల్లపిళ్ల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 2012 మార్చి 14న జరిగిన సత్యదేవుని నూతనాలయ శిఖర ప్రతిష్ఠలో పాల్గొన్న విశ్రాంత వేద పండితుడు గొర్తి సుబ్రహ్మణ్య ఘనపాఠి, అర్చకులు గాడేపల్లి సత్యనారాయణ, శేషగిరి, విశ్రాంత వ్రత పురోహితులు ఆకొండి వ్యాసమూర్తి, ప్రయాగ వేంకట రమణలను ఈఓ వీర్ల సుబ్బారావు ఘనంగా సత్కరించారు. వారికి శాలువా కప్పి, సత్యదేవుని ప్రసాదం, ఫొటో, పారితోషికం అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఘనంగా సత్యదేవుని ఆలయ వార్షికోత్సవం