రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

Mar 8 2025 12:09 AM | Updated on Mar 8 2025 12:10 AM

అటవీశాఖ ఉద్యోగినికి తీవ్ర గాయాలు

బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఘటన

గోకవరం: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్‌బంక్‌ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్‌పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్‌ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్‌ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

పిల్లలను పాఠశాల వద్ద దించి..

చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు.

యాన్యువల్‌ డేకి వెళ్లాలి డాడి లే..

ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్‌డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్‌స్టేషన్‌ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు.

హెల్మెట్‌ ఉన్నా..

బైక్‌ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్‌ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్‌ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్‌ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి 1
1/4

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి 2
2/4

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి 3
3/4

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి 4
4/4

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement