
6 వరకూ డ్రోన్‌లు వినియోగించరాదు
కాకినాడ సిటీ: వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం నిర్వహించే విజయోత్సవ ర్యాలీల సందర్భంగా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు జేఎన్‌టీయూకే వద్ద, జిల్లాలో రెడ్ జోన్స్‌గా గుర్తించిన ప్రాంతాల్లో వీడియోలు, ఫొటోలు తీసేందుకు డ్రోన్‌లు వినియోగించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ ఆదేశాలను అందరూ కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలో వచ్చే నెల 6వ తేదీ వరకూ ఎటువంటి డ్రోన్ కెమెరాలూ వినియోగించరాదని స్పష్టం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణ సామగ్రి భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఈఏపీ సెట్‌కు
97.67శాతం హాజరు
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల్లో ఏపీ ఈఏపీ సెట్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఈ ఆన్‌లైన్ పరీక్షకు ఉదయం 1,079 హాజరవగా 33 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 2,176 మంది హాజరు కాగా, 52 మంది గైర్హాజరయ్యారని సెట్ కన్వీనర్ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,899 మంది హాజరు కాగా 1,778 మంది పరీక్ష రాయలేదని వివరించారు.
ముద్రగడను కలసిన
వైఎస్సార్ సీపీ నాయకులు
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరిబాబును పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఒమ్మంగి నుంచి సుమారు 150 మంది గ్రామస్తులు, కిర్లంపూడి, జగపతినగరం, వేలంక గ్రామాలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఈ నెల 13న ఆయా గ్రామాల్లో జరిగిన ఎన్నికల తీరు, వైఎస్సార్ సీపీకి నమోదైన ఓటింగ్ వివరాలను ముద్రగడ అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రతిపక్షాలు చేసిన దాడులను పలువురు ముద్రగడ దృష్టికి తీసుకుని వచ్చారు.
జంతు సంరక్షణ చట్టాల
అమలుకు నోడల్ అధికారి
కాకినాడ క్రైం: హైకోర్టు ఆదేశాల మేరకు జంతు సంరక్షణ చట్టాల అమలుకు జిల్లా ప్రత్యేక నోడల్ అధికారిగా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావును నియమిస్తూ ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జంతు అక్రమ రవాణా, అక్రమ వధ వంటి అంశాల్లో ఎటువంటి సమాచారం అందినా ప్రజలు నేరుగా 94407 96501 నంబరుకు ఫోన్ చేసి, నోడల్ అధికారికి తెలియజేయాలని ఎస్పీ కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
కొబ్బరి కొనుగోలు కేంద్రాల
ఏర్పాటుకు చర్యలు
అంబాజీపేట: సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు నాఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ డిప్యూటీ కార్యదర్శి సంజయ్‌కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్టు ఆయిల్‌ఫెడ్ మేనేజర్ యు.సుధాకరరావు తెలిపారు. ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ ఆధారంగా 8 వేల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ కోప్రాను 6 నెలల వ్యవధిలో కొనుగోలు చేయనున్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది బాల్ కోప్రాను రూ.11,750కు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.12 వేలకు కొనుగోలు చేస్తారన్నారు. మిల్లింగ్ కోప్రాను రూ.10,860కు గత ఏడాది కొనుగోలు చేయగా ఈ ఏడాది రూ.11,120కు కొనుగోలు చేస్తారని వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అవసరమైన అనుమతులు తీసుకున్న తరువాతే కొనుగోలు తేదీ ప్రకటించాలని సంజయ్‌కుమార్ సూచించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించే ముందు కేంద్ర నోడల్ ఏజెన్సీ అన్ని రకాల వసతులూ పరిశీలించి తగిన నివేదిక రూపొందించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన జీఓ కాపీని రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్‌కు పంపినట్లు సంజయ్‌కుమార్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.