
కుమారారామ భీమేశ్వరస్వామికి తొలి అభిషేకం చేస్తున్న అర్చకులు
సామర్లకోట: కార్తిక మాసం చివరి ఆదివారం కావడంతో పంచారామ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కుమారారామ భీమే శ్వరస్వామి, బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచీ బారులు తీరారు. ధ్వజస్తంభం, రావి, జమ్మి, మారేడు చెట్లు, తులసి మొక్కల వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. ఈఓ టీవీ సూర్యనారాయణ ఆధ్వర్యాన వేకువన గోపూజతో స్వామివారికి అభిషేకాలు, పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆలయ అర్చకులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానానికి రూ.2,500 చెల్లించిన భక్తులు లక్షపత్రి పూజలు చేసుకున్నారు. మధ్యాహ్నం దేవస్థానం తరఫున భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గత నెల 14న ప్రారంభమైన కార్తిక మాసోత్సవాలు ఈ నెల 13తో ముగియనున్నాయి. ఈ సందర్భంగా దీపారాధన సంఘ సభ్యుల ఆధ్వర్యాన 12వ తేదీ మధ్యాహ్నం భారీగా అన్నదానం చేయనున్నారు. రాత్రి కోటి దీపోత్సవం నిర్వహిస్తారు. 13వ తేదీ మధ్యాహ్నం స్వామి వారికి వెండి ఆభరణాలతో జటాజూటం అలంకరణతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ అలంకరణను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.
జాతీయ స్థాయి అథ్లెటిక్
మీట్‌కు దుర్గ
సామర్లకోట: జాతీయ స్థాయి అథ్లెటిక్ మీట్‌కు చంద్రంపాలెంలోని ఉప్పరగూడెం జెడ్పీ హైస్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్ధి దేవిశెట్టి వెంకట దుర్గ ఎంపికయ్యాడు. హైస్కూల్ పీడీ కె.వీరబాబు ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించడం ద్వారా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న గుజరాత్‌లో జరిగే అండర్–14 జాతీయ అథ్లెటిక్ మీట్‌కు ఎంపికయ్యాడని వివరించారు. వెంకట దుర్గను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.
నేడు జగనన్నకు
చెబుదాం – స్పందన
కాకినాడ సిటీ: జగనన్నకు చెబుదాం – జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. అర్జీదారులు, జిల్లా అధికారులు ఈ విషయం గమనించాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
షష్ఠి వేడుకలకు పందిరి రాట
అన్నవరం: స్థానిక దేవస్థానం హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలకు ఆదివారం పందిరి రాట వేశారు. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం ముత్తయిదువులు పందిరి రాటకు పసుపు, కుంకుమ రాసి, మామిడాకులు అలంకరించారు. అనంతరం పండితుల మంత్రోచ్చారణ నడుమ పందిరి రాట వేశారు. ఈ నెల 17వ తేదీ మార్గశిర పంచమి సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లను వధూవరులను చేయడంతో సుబ్బారాయుడి షష్ఠి వేడుకలు ప్రారంభమవుతాయి. 18వ తేదీ షష్ఠి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి స్వామి, అమ్మవార్ల కల్యాణం దేవస్థానం హైస్కూల్ వేదికపై ఘనంగా నిర్వహించనున్నారు. 19వ తేదీ రాత్రి స్వామి, అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించడంతో వేడుకలు ముగుస్తాయి.
అంతర్వేది.. భక్తజన పెన్నిధి
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. కార్తిక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి పలువురు కుటుంబ సమేతంగా వచ్చారు. అలాగే అయ్యప్ప, భవానీ దీక్షాధారులు రావడంలో ఆలయం కిక్కిరిసింది. సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. సుమారు 15 వేల మంది భక్తులు వచ్చినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. భక్తులకు తాగునీరు అందించడంతో పాటు నిత్యాన్నదాన పథకంలో భోజన వసతి కల్పించారు.

వెంకట దుర్గ