
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా
అమలాపురం రూరల్: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పటిష్టంగా అమలు చేయాలని, రోగులకు నగదు రహిత వైద్యం అందించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా డిసిప్లినరీ కమిటీ సమావేశం మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 67 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్నాయని చెప్పారు. వీటిలో 48 మంది ఆరోగ్య మిత్రలు పని చేస్తున్నారన్నారు. ప్రతి నెలా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా డిసిప్లినరీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.దుర్గారావుదొర, ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ పి.పద్మశ్రీరాణి, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ పి.రాధాకృష్ణ, జిల్లా మేనేజర్ కె.నవీన్, ఆరోగ్యశ్రీ టీం లీడర్లు పాల్గొన్నారు.