
నాటిక పోటీల వివరాలు వెల్లడిస్తున్న సీఆర్‌సీ అధ్యక్షుడు నాగమోహన్‌రెడ్డి తదితరులు
రావులపాలెం: స్థానిక కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్‌సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యాన రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో 23వ ఉగాది జాతీయ తెలుగు నాటికల పోటీలు నిర్వహిస్తున్నామని సీఆర్‌సీ అధ్యక్షుడు తాడి నాగమోహన్‌రెడ్డి తెలిపారు. స్థానిక అక్షరా థియేటర్స్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నలుగురు సీనియర్ కాటన్ కళాపరిషత్ సభ్యులు నెల రోజుల పాటు 60 నాటికలు చూసి, ఏడింటిని ఎంపిక చేశారన్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో ఈ నాటికలు ప్రదర్శిస్తామన్నారు. తొలి రోజు తెనాలి కళల కాణాచి వారి అంధస్వరం, పొన్నూరు రసఝరి వారి కాలపా; రెండో రోజు వరంగల్ శారదా నాట్యమండలి వారి ఫ్రీడమ్ ఫైటర్; హైదరాబాద్ కళాంజలి వారి రైతే రాజు, కాకినాడ శ్రీసాయి కార్తిక్ క్రియేషన్స్ వారి ఎడారిలో వాన చినుకు; మూడో రోజు విజయవాడ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ వారి అతడు అడవిని జయించాడు, విశాఖపట్నం తెలుగు కళాసమితి వారి నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటికలు ప్రదర్శిస్తారని వివరించారు. చివరి రోజు సీఆర్‌సీ వారి ప్రత్యేక ప్రదర్శన ఉంటుందన్నారు. నాటికలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈసారి ప్రథమ, ద్వితీయ, తృతీయ భారీగా నగదు బహుమతులు ఇవ్వనున్నామని మోహన్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ ప్రథమ ప్రదర్శన నాటికకు రూ.3 లక్షలు, ద్వితీయ నాటికకు రూ.2 లక్షలు, తృతీయ ప్రదర్శన నాటికకు రూ.లక్ష నగదు బహుమతితో పాటు ప్రతి నాటికకు రూ.25 వేల పారితోషికం ఇస్తామని చెప్పారు. సమావేశంలో సీఆర్‌సీ ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, నాటక కళా పరిషత్ డైరెక్టర్ కె.సూర్య, పరిషత్ పర్యవేక్షకుడు వెలగల సతీష్‌రెడ్డి, సీఆర్‌సీ డైరెక్టర్ మల్లిడి ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.