
● అందుకే జగనన్న విద్యా దీవెన
● ఎంపీ వంగా గీత
● జిల్లాలో 43,617 మందికి
రూ.28.24 కోట్ల జమ
కాకినాడ సిటీ: పేద విద్యార్థులకు సైతం ఉన్న విద్యను దగ్గర చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం అమలు చేస్తోందని ఎంపీ వంగా గీత అన్నారు. గత ఏడాది అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన – ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ నుంచి ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగలక్ష్మీదేవి, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనుసూరి ప్రభాకరరావు, వివిధ కళాశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ, జగనన్న విద్యాదీవెన పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. ఎప్పటికప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తోందని వివరించారు. జగనన్న విద్యా, వసతి దీవెన పథకాల ద్వారా ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువుకోగలుగుతున్నారని అన్నారు.
జేసీ ఇలక్కియ మాట్లాడుతూ, జగనన్న విద్యా దీవెన పథకం కింద జిల్లాలోని 43,617 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ, కాపు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.28.24 కోట్లు జమ చేస్తోందని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని, ఉన్నత స్థానాలకు ఎదగాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ అధికారులు సత్యరమేష్, ఎ.విజయశాంతి, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.