
●
● నాడి చూడకుండానే నోట్ల వేట
● వైద్యుడు చూడకుండానే వైద్య పరీక్షలు
● ధన దాహంతో కొన్ని ప్రైవేటు
ఆసుపత్రుల నిర్వాకం
రావులపాలేనికి చెందిన రాజేశ్వరరావుకు
అకస్మాత్తుగా మాట ముద్దగా మారి, తల తిరుగుతూండటంతో మంచి వైద్యుడికి చూపించుకునేందుకు రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రికి వచ్చాడు. రూ.500 ఇచ్చి ఓపీ రాయించుకున్నాడు. అక్కడే బరువు, బీపీ చూసిన సిబ్బంది.. ఆ వివరాలను ఓపీ చీటీలో రాసి, మరో గదికి పంపారు. అక్కడ మరో వ్యక్తి ఇంకో చీటీలో హెచ్‌బీ, సీఆర్‌పీ, లివర్ ఫంక్షన్, ఫుల్ బ్లడ్ కౌంట్, టైడాట్, బ్లడ్ గ్లూకోజ్, కాల్షియం, విటమిన్ టెస్ట్, ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే వంటి రూ.4 వేల విలువైన పరీక్షలు చేయించుకోవాలని రాసిచ్చారు. అవాక్కయిన రాజేశ్వరరావు ‘ఇంకా వైద్యుడు చూడలేదు కదా’ అని అడిగితే.. ‘ఆయన వచ్చి చూసినా ఈ పరీక్షలు తప్పనిసరి. అప్పటి వరకూ ఉండటం వల్ల మీ సమయమే వృథా అవుతుంది’ అని సిబ్బంది బదులిచ్చారు. చేతి చమురు వదిలిపోతోందని బాధ పడుతూ, గత్యంతరం లేక వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆయన సంబంధిత విభాగానికి కాళ్లీడ్చుకుంటూ వెళ్లాడు.
కడుపు నొప్పితో బాధ పడుతున్న ఓ మహిళ నగరంలోని ఓ గైనిక్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి సిబ్బంది ముందుగానే స్కానింగ్ చేయించుకోవాలని ఆమెకు చెప్పారు. స్కానింగ్ చేయించుకుని వెళ్లిన ఆ మహిళను వైద్యుడు పరీక్షించి, మరికొన్ని రక్త పరీక్షలు రాసిచ్చారు. ఆమె ఆ పరీక్షలు కూడా చేయించుకుంది. తీరా చూస్తే ఆ రిపోర్టుల ఆధారంగా ఆమెకు వచ్చింది సాధారణ అజీర్తి నొప్పిగా నిర్ధారించి, దానికి అవసరమైనవి, అదనంగా బలానికని చెప్పి మందులు రాసిచ్చి, ఆసుపత్రిలోనే కొనిపించారు.
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ‘వైద్యో నారాయణో హరిః’ అని పెద్దలు అన్నారు. ప్రాణ ప్రదాత అయిన వైద్యుడు దేవుడితో సమానమని భావిస్తారు. అయితే ప్రస్తుతం వైద్యం అన్నా, కొంతమంది వైద్యులన్నా రోగులు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దోచుకోవడమే లక్ష్యంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దందా సాగిస్తూండటంతో రోగులు బెంబేలెత్తుతున్నారు. ఆసుపత్రిలో అడుగు పెట్టాక ఓపీ చీటీ ఇవ్వడం దగ్గరే దోపిడీ పర్వం మొదలవుతోంది. వైద్య పరీక్షలు, మందుల కొనుగోలులో కూడా ఆయా ఆసుపత్రులు ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో 670 ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. వీటిలో తూర్పు గోదావరిలో 350, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 120, కాకినాడ జిల్లాలో 200 ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ ఉన్నా...
పేద, మధ్య తరగతి రోగులు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డును చూపిస్తే సిబ్బంది ముందుగా రోగ లక్షణాలు నమోదు చేసుకుంటారు. అదే సమయంలో అక్కడి సిబ్బంది ఆ రోగి సమస్య ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని చెప్పి రోగి సహాయకులను ముందుగానే భయపెడతారు. దీంతో ధైర్యం కోల్పోయిన రోగి, ఏదోవిధంగా వైద్యం చేయించుకునేందుకు మానసికంగా సన్నద్ధమవుతాడు. రోగిని వైద్యుడు పరీక్షించిన తరువాత ఆసుపత్రి పీఆర్‌ఓలు రోగి సంబంధీకులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తారు. ‘నిజానికి మీ కేసు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదు. డాక్టరు గారు మీ పరిస్థితి చూసి ఏదోవిధంగా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా ప్రయత్నించమని మాకు చెప్పారు’ అంటూ ఈ విషయం ఎక్కడా చెప్పవద్దని నమ్మిస్తారు. ఆ సమయంలో రోగి బంధువులకు ఆ పీఆర్‌ఓ దేవుడిలా కనపడతారు. ముందుగా కొన్ని పరీక్షలు చేయాలని, వాటి ఖర్చులు మాత్రం వారే చెల్లించుకోవాలని సూచిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగి బంధువులు అందుకు అంగీకరించడంతో వైద్య పరీక్షల పేరిట దోపిడీ సాగిస్తారు. ఆ తరువాత ఆరోగ్యశ్రీ అప్రూవల్ పేరిట మరో రెండు రోజులు తాత్సారం చేస్తున్నారు.
దళారుల దందా
సాధారణంగా రోగులు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు పెద్దపెద్ద ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా తమకు అందుబాటులో ఉండే ప్రాథమిక వైద్యుల (బీఎంపీ/పీఎంపీ) వద్దకు వెళతారు. వారిలో కొందరు ప్రైవేటు ఆసుపత్రులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తారన్నది బహిరంగ రహస్యం. వీరు తమ వద్దకు వచ్చే రోగులకు, అనారోగ్య సమస్యలతో సంప్రదించే వారికి ఉచిత వైద్య సలహాలు, మెడికల్ రిప్స్ ఇచ్చే శాంపిల్స్ ఉచితంగా అందజేసి మంచి ముద్ర వేయించుకుంటారు. ఆయా రోగులు, వారి బంధువులు అనారోగ్య సమస్యలతో సంప్రదించినప్పుడు ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. రోగి ఆయా ఆసుపత్రులకు వెళ్లిన సమయంలో ఎవరి ద్వారా వచ్చారో తెలుసుకుని, దళారీగా వ్యవహరించిన సంబంధిత ప్రాథమిక వైద్యుడిని సంప్రదించి, రోగుల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి, ఆ ప్రకారం, వైద్యం చేసి, బిల్లులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలా రోగి చెల్లించే బిల్లులో 15 నుంచి 20 శాతం వరకూ ఆయా ప్రాథమిక వైద్యులకు కమీషన్‌గా ప్రైవేటు ఆసుపత్రులు చెల్లిస్తున్నాయి. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవల్లో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఇటువంటి ఆరోపణలు వస్తున్న ఆసుపత్రులపై స్వయంగా కలెక్టరే ఆకస్మిక తనిఖీలు చేశారు. విచారణ అనంతరం 12 ఆసుపత్రులపై రూ.14 లక్షల వరకూ జరిమానా విధించిన ఘటన నెల రోజుల క్రితం జరిగింది.
ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు ఏం చేయాలంటే..
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ఆసుపత్రిలోని ఆరోగ్య మిత్ర వద్దకు వెళ్లాలి.
రోగి వివరాలను నమోదు చేయించుకోవాలి.
ఆరోగ్య మిత్ర అందుబాటులో లేకపోతే అక్కడి డెస్క్‌లో ఉన్న ఫోన్ నంబర్‌కు వెంటనే తెలపాలి.
రోగి వివరాలను ఆరోగ్య మిత్ర రిజిస్టర్ చేసిన వెంటనే ప్రాథమిక వైద్య పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహించాలి.
దీనికోసం ఎవరైనా ముందుగా సొమ్ము చెల్లిస్తే ఆసుపత్రి యాజమాన్యాలు విధిగా ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి. అలా ఇవ్వకుంటే సచివాలయం సిబ్బంది ద్వారా గ్రీవెన్స్‌లో ఆ వివరాలు ఉంచుతారు. తద్వారా ఆ ఆసుపత్రికి పదింతల జరిమానా విధిస్తారు.
ఎవరికై నా ఆరోగ్యశ్రీలో ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఇబ్బందులు తలెత్తితే 104 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు.
ఆరోగ్యశ్రీ జిల్లాల కో ఆర్డినేటర్ల ఫోన్ నంబర్లు
తూర్పు గోదావరి : 92810 68129
కాకినాడ/డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ : 92810 68130
ఆరోగ్యశ్రీ ఉంటే రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆసుపత్రిలో ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వనవరంలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రలు కచ్చితంగా ఉంటారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకూ వారు చూసుకుంటారు. ఎవ్వరూ దళారులను ఆశ్రయించవద్దు. ఉదాహరణకు ఎవరైనా ఛాతి నొప్పితో వచ్చారనుకోండి. డైరెక్ట్‌గా ఆసుపత్రిలోని కార్డియాలజిస్ట్ చూడరు. అక్కడి ఆరోగ్యశ్రీ మెడికోలు ముందుగా ఈసీజీ, ఎకో పరీక్షలు ఉచితంగా చేస్తారు. అందులో వచ్చిన రిపోర్టులను బట్టి ముందుకు వెళతారు. ప్రాథమిక నిర్ధారణ పరీక్షలన్నీ ఉచితం.
– ప్రియాంక, జిల్లా కో ఆర్డినేటర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
చర్యలు తీసుకుంటాం
రోగిని వైద్యుడు చూడకుండా వేరే వ్యక్తి వైద్య పరీక్షలు రాసివ్వడం చట్టరీత్యా నేరం. ఈవిధంగా ఏ ఆసుపత్రిలో జరిగినా వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. దీనిపై ప్రత్యేక ఆపరేషన్ చేపడతాం. ముందుగా ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్తాం. వారి సహకారం తీసుకుంటాం.
– డాక్టర్ కె.వెంకటేశ్వరరావు,
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి

