ఆత్మకూర్: జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై రూ.123 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు సకాలంలో పూర్తి చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక నాయకులతో వంతెన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుందని, వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల–ఆత్మకూర్ మధ్య రాకపోకలకు సమయంతో పాటు దూరం తగ్గుతుందన్నారు. వర్షాకాలంలోగా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసి ఏడాదిలోగా వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ నుంచి వయా ఆత్మకూర్, గద్వాల, రాయచూరు మీదుగా మంత్రాలయం వెళ్లే వారికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, పుర చైర్‌పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్, జిల్లా కార్యదర్శి తులసీరాజ్ యాదవ్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు ఉన్నారు.


