రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

May 13 2026 12:50 AM | Updated on May 13 2026 12:50 AM

లాభదాయక పంటల సాగుపైఅవగాహన కల్పించాలి

కేంద్ర వ్యవసాయశాఖ

నోడల్‌ అధికారి రఘు

గద్వాల/ఎర్రవల్లి: ప్రధానమంత్రి ధన్‌–ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) పథకంతో రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యమని.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు అభివృద్ధి సాధించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర వ్యవసాయశాఖ (పీఎంఓ) నోడల్‌ అధికారి రఘు అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ధన్‌–ధాన్య కృషి యోజన కేవలం గణాంకాలు, లక్ష్యాల సాధనకే పరిమితం కాకుండా.. రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు, పంటల వైవిధ్యీకరణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపు, నేల ఆరోగ్య సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, మార్కెట్‌ అనుసంధానం వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్‌పామ్‌, పప్పుధాన్యాలు, ఉద్యాన, అంతర పంటల సాగువైపు దృష్టిసారించేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, సహకార వ్యవస్థ ద్వారా మరింత రుణసౌకర్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, మొక్కలు, ఎరువులు, సూక్ష్మ నీటిపారుదల సదుపాయాలు, రుణాలు, సాంకేతిక సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

● ఎర్రవల్లి మండలం తిమ్మాపురం, కొండేరు, జింకలపల్లి గ్రామాల్లో కేంద్ర నోడల్‌ అధికారి రఘు పర్యటించి.. రైతుల చేపల చెరువులను పరిశీలించారు. బీచుపల్లిలో తెలంగాణ ఆయిల్‌పామ్‌ నర్సరీని సందర్శించి, జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం, రైతులకు లభిస్తున్న ఆదాయం వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా కొండేరు శివారులో సాగుచేసిన కూరగాయల తోటలను ఆయన పరిశీలించి.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అమలవుతున్న పథకాలు, రుణ సదుపాయాలు, ఈ ప్రాంత మౌలిక వసతులు, తదితర విషయాలపై రైతులతో ఆరా తీశారు. కొండేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆయిల్‌పామ్‌ తోటలను పరిశీలించారు. వైవిధ్యమైన పంటల సాగుతో రైతులు మెరుగైన ఆదాయం సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని అమలు చేస్తోందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయిల్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌, డీఏఓ వీరప్ప, జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్‌, ఆయిల్‌ఫెడ్‌ ఏడీఏ శివనాగిరెడ్డి, డివిజినల్‌ ఉద్యానశాఖ అధికారులు రాజశేఖర్‌, ఇమ్రానా, ముసాయిదాబేగం, ఏఓ సురేశ్‌గౌడ్‌, ఏఈఓలు నరేశ్‌, ప్రవళిక, సర్పంచ్‌ పెద్ద మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement