ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలో మంగళవారం అంజన్న నామస్మరణ మార్మోగింది. హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,299
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 15 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,299, కనిష్టంగా రూ. 7,071 ధర పలికింది. అదే విధంగా 70 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,429, సరాసరి రూ. 5,879 ధరలు లభించాయి. 976 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,294, కనిష్టంగా రూ. 1,889, సరాసరి రూ. 2,001 ధరలు వచ్చాయి. 6 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,421, కనిష్టంగా రూ. 6,389 ధర పలికింది.
స్వయం ఉపాధిలో
ఉచిత శిక్షణ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద గ్రామీణ యువతకు స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా హౌస్ వైరింగ్, బైక్ మెకానిక్ రంగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 99633 69361, 98481 42489లను సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
జడ్చర్ల: జడ్చర్లలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థలో తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్, హోం అప్లియెన్సెస్ కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సెట్విన్ కోఆర్డినేటర్ విజయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18– 35 ఏళ్లలోపు మైనార్టీ ముస్లిం యువతీ, యువకులు మాత్రమే ఆధార్, 10వ తరగతి సర్టిఫికెట్, రెండు ఫొటోలతో ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నం.94415 65895ను సంప్రదించాలని పేర్కొన్నారు.
అధిక మోతాదులో యూరియా వాడొద్దు
వనపర్తి రూరల్: అధిక మోతాదులో యూరియా వినియోగించడంతో నేల సారం తగ్గడంతో పాటు పంటల నాణ్యత దెబ్బతింటుందని ఆగ్రోనామి శాస్త్రవేత డా. నవత అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లి రైతువేదికలో మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆమె హాజరై రసాయన ఎరువులపై రైతులకు అవగాహన కల్పించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం ఉత్తమమని సూచించారు. ఎరువులు, పురుగు మందులు సరైన మోతాదులో, సరైన సమయంలో వాడాలని, ఇది పంటల నాణ్యతను పెంచడంతో పాటు సాగు ఖర్చు తగ్గిస్తుందన్నారు. ఏఓ షేక్ మున్నా మాట్లాడుతూ.. వివిధ రకాల పంటలు సాగు చేయడంతో రైతులకు ఆదాయం స్థిరంగా ఉంటుందని చెప్పారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వరి వంగడాలను ఎంపిక చేసుకోవడంతో మెరుగైన ధర వస్తుందని తెలిపారు. భూ సారం పెంపొందించేందుకు జీలుగ, జనుము సాగుచేసి పూత దశలో భూమిలో కలియ దున్నాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ రజిత, రైతులు రామచంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


