అలంపూర్: ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై పోలీసు సిబ్బంది పటిష్ట నిఘా ఉంచాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అలంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన సరిహద్దు చెక్‌పోస్టుతో పాటు ఎర్రవల్లి చెక్‌పోస్టును సోమవారం అర్ధరాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. వాహనాల పత్రాలు, పశువుల రవాణాకు సంబంధించిన అనుమతులు, డ్రైవర్ల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని సూచించారు. పశువుల అక్రమ రవాణాను నియంత్రించడానికి జిల్లా సరిహద్దుల్లోని బల్గేర, నందిన్నె, ఇర్కిచేడు, సుంకేసుల డ్యామ్, భైరాపురం, పుల్లూరు టోల్‌ప్లాజా, ఎర్రవల్లి చౌరస్తా వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎవరైనా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పశువుల రవాణాకు సంబంధించి తప్పనిసరిగా అనుమతి పత్రాలు, కొనుగోలు రశీదులు, వెటర్నరీ ధ్రువపత్రాలు ఉండాలని సూచించారు. రవాణాలో పశువులపై క్రూరత్వం ప్రదర్శించినా, నిబంధనలకు విరుద్ధంగా తరలించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జంతు సంరక్షణ చట్టాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవడం.. గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణను పకడ్బందీగా కొనసాగించాలని ఎస్పీ అదేశించారు. ఆయన వెంట డీఎస్పీ మొగిలయ్య, సీఐ ప్రదీప్, ఎస్‌ఐ శేఖర్ ఉన్నారు.


