జనగణన.. దేశాభివృద్ధికి పునాది | - | Sakshi
Sakshi News home page

జనగణన.. దేశాభివృద్ధికి పునాది

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల: ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జనగణన దేశాభివృద్ధికి పునాది వంటిదని.. పౌరుల ఉజ్వల భవిష్యత్‌కు ప్రణాళికల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలుకు ఎంతో దోహదపడుతుందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. జనగణన–2027పై శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించగా.. వివిధ శాఖల అధికారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొదటగా ఇళ్ల గణన చేపడుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 26 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు స్వీయగణనకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు స్వీయ గణనలో భాగస్వాములై జిల్లాను రాష్ట్రంలోనే ముందుండేలా సహకరించాలని కోరారు. అనంతరం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా వ్యాధి లక్షణాలు, చికిత్స తదితర అంశాలపై ప్రోగ్రాం అధికారి రాజు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, సీపీఓ పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారుల అభ్యున్నతికి కృషి

మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మత్స్యకారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మత్స్యశాఖ కూడ ప్రధానమైనదన్నారు. జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో నాణ్యమైన చేపపిల్లలను సకాలంలో వదిలేందుకు రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్‌తో మాట్లాడతానని తెలిపారు. చెరువుల్లోకి ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు చేరకుండా మత్స్యకారులు అసవరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే రెన్యువల్‌ చేస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి, సీ్త్రనిధి, ప్రధానమంత్రి మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి రుణాలతో కులవృత్తిని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చన్నారు. పీఎండీడీకేవైకు జిల్లా ఎంపిక కావడం ద్వారా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఆశించిన పురోగతి సాధించడానికి అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన వంటి పథకాలను అర్హులైన మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి షకీలాభాను, ఇరిగేషన్‌శాఖ ఈఈ శ్రీనివాస్‌, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ కోరారు. ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరయ్యాయని తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించి.. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్‌లో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయాలన్నారు. బడిబాటతో పాటు ఇతర కార్యక్రమాలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మి, డీఐఈఓ హృదయరాజు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement