తపాలాశాఖలో సీబీఐ కలకలం | - | Sakshi
Sakshi News home page

తపాలాశాఖలో సీబీఐ కలకలం

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

తోటి ఉద్యోగుల నుంచి లంచం

ఆశించిన పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌

సుదీర్ఘ విచారణ అనంతరం

అదుపులోకి తీసుకున్న అధికారులు

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పనిచేస్తున్న గోపీనాథ్‌ తోటి ఉద్యోగుల నుంచి లంచం తీసుకుంటున్నట్లు పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 7 వరకు అదుపులోకి తీసుకొని విచారించారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి ప్రధాన పోస్టల్‌ కార్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న స్థానాల్లో బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్‌ సేవక్‌లకు అదనపు విధులు కేటాయిస్తారు. ఇందుకుగాను అదనంగా డబ్బులు చెల్లిస్తారు. 2023 నుంచి 2026 వరకు అదనపు విధుల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో మంజూరుకు పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒక్కొక్కరికి వచ్చే డబ్బుల నుంచి కొంత శాతం తనకు చెల్లించాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో కొందరు బీపీఎం, ఏబీపీఎం, డాక్‌సేవక్‌లు చెల్లించగా.. ఒకరిద్దరు సీబీఐ అధికారులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి కార్యాలయానికి సీబీఐ అధికారులు చేరుకోగా.. విషయం తెలుసుకున్న గోపీనాథ్‌ పరారయ్యారు. సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సెల్‌ఫోన్‌ ట్రేసింగ్‌ ద్వారా గుర్తించిన సీబీఐ అధికారులు పట్టుకొని పోస్టల్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణలో అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం, కార్యాలయ ట్రెజరీలో కొంత నగదుకు సంబంధించి లెక్కలు చూపడంలో విఫలం కావడంతో గురువారం రాత్రంతా అక్కడే ఉంచారు. విధులు ముగించుకొని ఇంటికెళ్లిన మిగతా ఉద్యోగులను రాత్రి 10.30 గంటలకు కార్యాలయానికి పిలిపించి బీపీఎంలకు సంబంధించి బిల్లుల చెల్లింపులో జాప్యం, కార్యాలయ ట్రెజరీలో అదనంగా నిల్వ ఉన్న డబ్బులపై ఆరా తీసినట్లు తెలిసింది. అన్ని వివరాలను లిఖితపూర్వకంగా ధ్రువీకరించుకొని నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం 7 వరకు కార్యాలయంలోనే ఉండి సుదీర్ఘ విచారణ అనంతరం పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌ను కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి వనపర్తి ప్రధాన పోస్టల్‌ సూపరింటెండెంట్‌ భూమన్న అంగీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement