గద్వాలవ్యవసాయం: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాలు అమలుచేస్తోందని మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, వైస్‌చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవాల్లో వారు పాల్గొని మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తులను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. ఈనామ్ ద్వారా రైతులు తమ పంటను ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనామ్ విధానంతో గద్వాల యార్డులో చాలా మంది రైతుల పంట ఉత్పత్తులను మంచి ధరలకు కొనుగోలు చేసినట్లు వివరించారు. మార్కెట్‌యార్డు అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారిణి సబిత, మార్కెట్ కార్యదర్శి నర్సింహ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,599
గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 98 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,599, కనిష్టంగా రూ. 4,769, సరాసరి రూ. 6,506 ధరలు లభించాయి. అదే విధంగా 51 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,011, కనిష్టంగా రూ. 5,519, సరాసరి రూ. 5,829 ధరలు పలికాయి. 1,944 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,256, కనిష్టంగా రూ. 1,686, సరాసరి రూ. 2,039 ధరలు లభించాయి.
ఆదిశిలా క్షేత్రంలో
జిల్లా పరిశ్రమల మేనేజర్
మల్దకల్: ఆదిశిలా క్షేత్రాన్ని బుధవారం జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వరగౌడ్ సందర్శించి.. స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి ఆయనకు తీర్థప్రసాదాలను అందజేసి.. ఆదిశిలా క్షేత్రం విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు పూలమాల, శేషవస్త్రంతో రామలింగేశ్వరగౌడ్‌ను సత్కరించి మెమోంటో అందజేశారు.


