గద్వాల: జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా మధుమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన వి.లక్ష్మీనారాయణ గతనెల 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో కామారెడ్డి డీఆర్వోగా పనిచేస్తున్న సీహెచ్.మధుమోహన్‌ను ప్రభుత్వం నియమించింది.
నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత
ధరూరు: మండలంలోని రేవులపల్లి వద్ద ఉన్న మిషన్ భగీరథ నీటిశుద్ధి కర్మాగారాన్ని శుభ్రపరిచేందుకు గాను బుధవారం తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవిచంద్రకుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం నీటి సరఫరా ఉండదని.. ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. గురువారం నుంచి నీటి సరఫరా యథావిధిగా ఉంటుందని తెలిపారు.
జోగుళాంబ సన్నిధిలో దివ్యమైన అనుభూతి
అలంపూర్ రూరల్: అష్టదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన శ్రీజోగుళాంబదేవి అమ్మవారి సన్నిధిలోనే దివ్యమైన అనుభూతి కలుగుతుందని హైదరాబాద్ పురాణపీఠం అనంతసాహితీ ఆశ్రమం గురువు శ్రీఅనంతానంద భారతి స్వామిజీ అన్నారు. మంగళవారం అలంపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. హిందూ సమాజంపై గౌరవభావం, స్వధర్మంపై అంకితభావం వికసింపజేయాల్సిన అవసరముందన్నారు. హిందువులంతా జాగృతమై సమాజ సంరక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ కట్ట ప్రభాకర్, కార్యదర్శి కావలి శ్రీనివాసులు, నాగమద్దిలేటి, నాగమల్లయ్య, నరేశ్, సర్పంచ్ ఈశ్వరయ్య, రంగస్వామి, జగదీశ్ పాల్గొన్నారు.
రేపు బాక్సింగ్
క్రీడాకారుల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి అండర్–19, అండర్–22 బాలబాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బొంబాయి నర్సింహులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు 10 వెయిట్ కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని, 7వ తేదీ(గురువారం) ఉదయం 7 గంటలకు హాజరుకావాలని సూచించారు.
యువతకు ఉపాధి
రంగాల్లో శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7, 8 తేదీల్లో నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కెరీర్ గోల్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్‌మెంట్, ఇంటర్‌నెట్ అవగాహన, ఫైనాన్సియల్ లిటరసీ, ఇండస్ట్రీయల్ అవగాహన, ప్రాబ్లం సాల్వింగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
వేరుశనగ క్వింటా రూ.7,392
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్‌కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.


