రాజోళి: మొక్కజొన్న రైతులకు క్షణక్షణం గండంగా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉన్నా తమవంతు వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాలకు బలికాక తప్పని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్నలు తీసుకొస్తే.. కనీసం కుప్పగా పోసుకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని.. ఇదే క్రమంలో ఎక్కడో చోట పోసుకున్న ధాన్యానికి రక్షణ లేకుండా పోతుందని ఆవేదన చెందుతున్నారు. తమ దుస్థితి ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదని వాపోతున్నారు.
● రాజోళి, వడ్డేపల్లి తదితర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. గత వారంలో కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోగా.. ఎండలు ఉన్న కారణంగా ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో రైతులు నిత్యం ఆందోళన చెందుతున్నారు.
చోరీకి గురవుతున్న ధాన్యం..
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా గుర్తుతెలియని దుండగులు ధాన్యాన్ని చోరీ చేస్తున్నారు. ఇటీవల వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన రైతు 3 క్వింటాళ్ల ధాన్యం చోరీకి గురైంది. దీంతో రైతు పడిన బాధ వర్ణనాతీతం. అయితే మరికొందరి ధాన్యం కిలోల లెక్కన చోరీకి గురవుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రాల వద్ద ధాన్యాన్ని రక్షించుకునేందుకు రాత్రి, పగలు పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు..
వడ్డేపల్లి కొనుగోలు కేంద్రం వద్ద వారం రోజులు గా మొక్కజొన్న అమ్మేందుకు పడిగాపులు కాస్తు న్నా. ఈ క్రమంలో ధా న్యం కుప్పలో 3 క్వింటాళ్ల మేర చోరీకి గురైంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం దొంగలపాలైంది. అధికారులు త్వరగా కొనుగోలు చేయాలి. – ఎద్దుల తిమ్మప్ప, రైతు, తనగల
వర్షాల భయం వెంటాడుతుంది
మొక్కజొన్న అమ్మకాల్లో ఆలస్యం జరిగినా ఓపిగ్గా ఉంటున్నాం. కానీ కేంద్రాల వద్ద సరైన ఏర్పాట్లు చేయకుండా ఎదురుచూడాలంటే ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే అన్ని ఖర్చులు రైతులే భరిస్తున్నారు. ఈ సమయంలో వర్షాల భయం వెంటాడుతుంది. అమ్మకాల ప్రక్రియలో వేగం పెంచాలి.
– సునీల్, రైతు, వడ్డేపల్లి
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు
అకాల వర్షాలతో ఆందోళన


