22 నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
గద్వాలటౌన్: విద్యార్థులలో దాగివున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సృజనాత్మకతను వెలికితీసి వారిని భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనక్ పోటీలను ఏర్పాటు చేస్తుందని డీఈఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం స్థానిక బాలభవన్‌లో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శన కమిటీ సభ్యుల సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శన వివరాలను విలేకర్లకు వెల్లడించారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వైజ్ఞానిక, గణిత, పర్యావరణ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను డిసెంబర్ 22, 23వ తేదీలలో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రదర్శనల్లో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
13 మండలాలు.. 175 పాఠశాలలు
జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 175 పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రదర్శనలు ఇస్తున్నారని చెప్పారు. జూనియర్ (6,7 తరగతులు), సీనియర్ (8,9,10 తరగతులు) విభాగాలుగా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక పోటీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస, సెమినార్, సైన్స్ సంబంధిత డ్రామాలు ఉంటాయన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మొత్తం 14 ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీస్తూ భావి శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఇవి వేదికలుగా ఉపయోగపడతాయన్నారు. అదనపు సమాచారం కోసం జిల్లా సైన్స్ అధికారి సెల్: 9502647200కు సంప్రదించాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి భాస్కర్ పాపన్న, శ్రీనివాస్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, శాంతిరాజు, హంపయ్య పాల్గొన్నారు.
జాతరలో దుకాణాల ఏర్పాటుపై వివాదం
గద్వాల క్రైం: గద్వాల సంతాన వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చిరు వ్యాపారులు ఏర్పాటు చేసే దుకాణాలపై వివాదం నెలకొంది. ప్రతి సంవత్సరం పట్టణంలోని భీంనగర్ రోడ్డు మార్గంలో చిరు వ్యాపారులు, వలస వ్యాపారం చేసే వారు జాతర అంగళ్లు ఏర్పాటు చేసుకుని భక్తులకు, ప్రజలకు వివిధ తిను బండారాలు, ఆటవస్తువులు, వస్తు సామగ్రి క్రయ విక్రయాలు చేస్తారు. అయితే ఇటీవల రోడ్డు మార్గంలో వెలసిన వ్యాపార, వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణ యాజమానులు ఈ వీధి వ్యాపారులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలోనే గురువారం భీంనగర్ రోడ్డు మార్గంలో జాతరలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో కొందరు వ్యాపారులు అడ్డుకున్నారు. ఏళ్లుగా బ్రహ్మోత్సవాల్లో 10 – 15 రోజుల పాటు దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్న తరుణంలో ఇలా వ్యతిరేకించడంపై వీధి వ్యాపారులు ఆందోళన చెందారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వీధి వ్యాపారులతో దుకాణాలు వేయించారు. అడ్డుకున్న వ్యాపారులను మందలించి సామరస్యంగా ఉండాలని, లేని తరుణంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


